అత్యాచారం మరియు లైంగిక దాడి అంటే ఏమిటి
అత్యాచారం మరియు లైంగిక దాడి అనే రెండూ ఒక మహిళ కోరుకోని లైంగిక సంబంధాన్ని సూచిస్తాయి. అత్యాచారం అంటే, ఒక మహిళ నుండి సమ్మతి లేకుండా ఒక పురుషుడు అతడి పురుషాంగం, వేలు లేదా ఏదైనా వస్తువును ఆ మహిళ యోని, పాయువు లేదా నోట్లో ఉంచడం అని అర్థం.
అత్యాచారాన్నే కొన్నిసార్లు లైంగిక 'దాడి' అని పిలుస్తారు. ఎందుకంటే , అదొక హింసాత్మక చర్య. అందులో సెక్స్‌నే ఒక ఆయుధంగా ఉపయోగించడం జరుగుతుంది. లైంగిక దాడిలో అత్యాచారంతో పాటు ఇతర రకాల అవాంఛిత లైంగిక చర్యలు కూడా ఉండవచ్చు.
పురుషుడు ఒక స్త్రీని కొట్టడం లేదా ఆమె అపస్మారక స్థితికి వెళ్లేలా బలవంతపు సెక్స్ చేసినప్పుడే అది అత్యాచారం అని కొందరు భావిస్తారు. ఆమె ఆసమయంలో తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలని, అత్యాచారం జరగకుండా చచ్చే వరకు పోరాడాలని భావిస్తారు. కానీ, ఒక మహిళ ఎదురుదాడి చేయకపోయినప్పటికీ, అది అత్యాచారమే. ఆమె ఏమీ చేయకుండా ఉండిపోయినప్పటికీ, అలాంటి ప్రయత్నం చేయనప్పటికీ, ఆమె మీద జరిగింది అత్యాచారమే. అందులో ఆమె తప్పేమీ లేదు. అత్యాచారం అనేది ఒక లైంగిక దాడి. ఆవిషయంలో మహిళను నిందించకూడదు.