అబ్బాయి కంటే నా ప్రాముఖ్యత తక్కువగా ఉంటుందా
ఒక స్త్రీ తన గురించి తాను ఎలా భావిస్తుందనే భావన ఆమె ఎదిగే కొద్దీ ఆమెలో ఏర్పడుతుంది. ఒక అమ్మాయి చిన్నతనంలోనే తన గురించి మంచి అనుభూతితో ఉండేలా నేర్చుకోవడం చాలా ముఖ్యం. తద్వారా, ఆమె పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందగలదు మరియు సమాజాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో ఆమె సహాయపడుతుంది. కుటుంబం మరియు సమాజం ఒక అమ్మాయిని విలువైనదిగా చూసినప్పుడు ఆమెలో అలాంటి భావన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అనేక ప్రదేశాల్లో అబ్బాయిల కంటే తమ ప్రాముఖ్యత తక్కువని అమ్మాయిలు విశ్వసించేలా వారిని పెంచుతారు. అమ్మాయిలు వాళ్ల శరీరాల గురించి మరియు స్త్రీగా ఉండడం గురించి ఎప్పుడూ సిగ్గుతో ఉండాలని నేర్పుతారు మరియు వారి సోదరుల కంటే తక్కువ విద్య, తక్కువ ఆహారం, ఎక్కువ దుర్వినియోగం మరియు ఎక్కువ పనికి సిద్ధపడేలా నేర్పిస్తారు. ఇది వారి ఆరోగ్యాన్ని నేరుగా దెబ్బతీయడమే కాకుండా తమ గురించి తామే తక్కవ చేసుకునేలా చేస్తుంది మరియు భవిష్యత్తులో ఆరోగ్యకర జీవితం కోసం సరైన నిర్ణయాలు తీసుకోలేని విధంగా చేస్తుంది. బాలికలు ఈ విధమైన పరిస్థితిలో పెరిగారంటే, వారి సమాజాలు వారిని అబ్బాయిలతో సమానంగా గౌరవించడం లేదని ఇది చూపిస్తుంది.
కానీ, ఒక అమ్మాయికి సంబంధించిన సమాజంలో ప్రతి వ్యక్తి విలువను గుర్తిస్తే, అంటే, ఆ వ్యక్తి పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే ఒక విధమైన గౌరవం ప్రదర్శించినప్పుడు, తనకుతాను మరియు తన కుటుంబానికి మరియు పొరుగువారికి తాను మెరుగైన జీవితం అందించగలననే భావనతో ఆమె పెరుగుతుంది.
ఒక సమాజంలో స్త్రీలతో వ్యవహరించే విధానం అనేది అందులోని కుటుంబాలు వారి ఆడపిల్లలతో వ్యవహరించడాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, బాలికలు కూడా నైపుణ్యాలు నేర్చుకోవాలని ఒక సమాజం విశ్వసిస్తే, అందులో నివసించే కుటుంబం కూడా వారి కుమార్తె వీలైనంత కాలం పాఠశాలకు వెళ్లాలని కోరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, మహిళలు 'మహిళల పని' మాత్రమే చేయాలని మరియు ఏ బహిరంగ సమావేశాల్లోనూ వాళ్లు పాల్గొనకూడదని శాసించే సమాజంలోని కుటుంబాలు వారి కుమార్తెలకు విద్య అందించే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి.