ఆడబిడ్డను కడుపులో మోయడానికి లేదా ప్రసవించడానికి ఎదురయ్యే సంఘర్షణను నేను ఎలా ఎదుర్కోవాలి

From Audiopedia
Jump to: navigation, search

కడుపులో ఉన్నది ఆడబిడ్డని తెలిసినప్పుడు గర్భస్రావం చేసుకోవాలని మీ భర్త లేదా అతని కుటుంబం మీ మీద ఒత్తిడి తెస్తుంటే, మిమ్మల్ని మరియు మీ ఆడ శిశువును రక్షించుకోవడానికి మీరు క్రింది వ్యూహాలు ఉపయోగించవచ్చు:

1. స్త్రీలు లేకుండా ఏ అబ్బాయి జన్మించలేడని, కాబట్టి, ఆడపిల్ల అంటే సమాజానికి ఒక ఆశీర్వాదం అని, ఈ ప్రపంచంలో జీవం కొనసాగించడానికి ఆడపిల్ల అవసరం అని మీ భర్త మరియు అతని కుటుంబానికి చెప్పండి.

2. సమాజానికి అమ్మాయిలే మూలస్తంభాలని మీ భర్తకు వివరించండి. ఒక అమ్మాయి మంచి కుమార్తె కావచ్చు, మంచి సోదరి కావచ్చు, మంచి భార్య కావచ్చు, భవిష్యత్తులో మంచి తల్లి కావచ్చు. రాబోయే కొన్ని సంవత్సరాలు ఇలాగే గర్భస్రావాలు కొనసాగితే, మనం ఖచ్చితంగా తల్లులు లేని రోజును చూడాల్సి వస్తుంది. అప్పుడు పిల్లల్ని కనే వాళ్లే ఉండరు. కాబట్టి, కుమార్తెలు లేకపోతే, మనకు భవిష్యత్తు లేదు.

3. సాధారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ విధేయతతో ఉంటారని మీ భర్తకు చెప్పండి. సాధారణంగా, అబ్బాయిల కంటే అమ్మాయిలే తమ కుటుంబం, ఉద్యోగం, సమాజం లేదా దేశం పట్ల ఎక్కువ బాధ్యత, భక్తి మరియు గౌరవంతో ఉంటారు మరియు తరచుగా వారు తమ తల్లిదండ్రుల గురించి అబ్బాయిల కంటే చాలా ఎక్కువ శ్రద్ధ వహిస్తారు అని చెప్పండి.

4. మీ భర్త మరియు అతని కుటుంబం ఇప్పటికీ, మీ మాటలు మన్నించకపోతే, 'అమ్మాయిల్ని మాత్రమే కంటున్నారని' మిమ్మల్ని నిందిస్తే, క్రింది శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాల గురించి వారికి తెలుసని నిర్ధారించుకోండి (మీ భర్త అనుమానం తీరకపోతే, ఎవరైనా వైద్యుడు లేదా ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్తే వాళ్లు స్పష్టంగా చెబుతారు):

  • శిశువు లింగం అనేది ఫలదీకరణం సమయంలో నిర్ణయించబడుతుంది. శిశువు మగ లేదా ఆడ అనేది మగవారి వీర్యం ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. మనమందరం మన తల్లిదండ్రుల నుండి జన్యు పదార్థం స్వీకరిస్తాము. అందుకే పిల్లలు వాళ్ల తల్లి మరియు తండ్రిలాగా కనిపిస్తుంటారు.
  • గర్భధారణకు ముందు, స్త్రీలోని ఫలదీకరణ చెందని అండంలో X-క్రోమోజోమ్ అనే జన్యు పదార్థం మాత్రమే ఉంటుంది. అయితే, మగవారి వీర్యం ద్వారా వచ్చే జన్యు పదార్థంలో X-క్రోమోజోమ్ లేదా Y-క్రోమోజోమ్ ఉంటుంది.
  • X క్రోమోజోమ్‌తో వచ్చే వీర్యంతో అండం ఫలదీకరణ జరిగితే, ఆడపిల్ల పుడుతుంది. Y క్రోమోజోమ్‌తో వచ్చే వీర్యంతో అండం ఫలదీకరణ జరిగితే, మగపిల్లాడు పుడుతాడు.
  • కాబట్టి, శిశువు లింగ నిర్థారణ అది తల్లి అండం వల్ల కాకుండా, తండ్రి వీర్యం ద్వారా జరుగుతుంది. కాబట్టి, స్త్రీ తన పిల్లల లింగానికి ఎప్పుడూ బాధ్యత వహించదు. కాబట్టి, మీ పిల్లల లింగత్వానికి బాధ్యత మీ భర్తదే తప్ప, మీది కాదు.

గుర్తుంచుకోండి: మీ గర్భంలోని శిశువు ఆడ లేదా మగ అని తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా మరేదైనా పరీక్ష కోసం తీసుకు వెళ్తామంటే, వీలైనంతవరకు అంగీకరించకండి. మీ భర్త లేదా అతని కుటుంబం మీ మీద అలాంటి ఒత్తిడి తీసుకొస్తే, సహాయం మరియు మద్దతు కోసం ప్రయత్నించండి. బహుశా మీ ప్రాంతంలో మహిళల కోసం స్వయం సహాయక బృందం ఉండవచ్చు. లేకపోతే, మీరు విశ్వసించే అధికారం గల వ్యక్తితో (ఉదాహరణకు ఆరోగ్య కార్యకర్త, మీ సమాజంలోని మత నాయకుడు లేదా సీనియర్ కుటుంబ సభ్యుడు)తో మీరు మాట్లాడవచ్చు.

Sources
  • Audiopedia ID: tel021010