ఇంటి పనుల్లో వచ్చే విభేదాలను నేనెలా ఎదుర్కోవచ్చు
ఇంటి పనుల్లో తలెత్తే విభేదాలు పరిష్కరించడానికి క్రింది కొన్ని వ్యూహాలు అనుసరించవచ్చు:
1. మీ సమస్యలన్నింటినీ మీరు ఒంటరిగా ఎదుర్కోవాల్సిందే అనే ఆలోచన మానేయండి. మీ సమస్యలను ఇతరులతో పంచుకోకపోవడమనేది మీ ఒత్తిడి స్థాయిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు మరియు మీ మిగిలిన కుటుంబ సభ్యుల మీద కూడా అది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి, మీరు విశ్వసించే కొద్దిమందితోనైనా మీ భావాలు పంచుకోండి. మీ సమస్యలను వెంటనే పరిష్కారం కాకపోయినప్పటికీ, వాటి గురించి మాట్లాడటం వల్ల ఒత్తిడి మరియు ఉద్రిక్తత తగ్గుతుంది.
2. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు (కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు) ద్వారా మీ సమస్యలకు సహాయం పొందే ప్రయత్నం చేయండి. సహాయం రాకపోతే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు వివరించడానికి వివిధ మార్గాలు ఉపయోగించి మళ్ళీ అడగడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోరు లేదా మద్దతు ఇవ్వరు. అయితే, కొందరు ఆ తర్వాతైనా మీ అవసరాలు గుర్తించి మీకు మద్దతు ఇస్తారు. మహిళకు సహాయం అవసరమని కొన్నిసార్లు పురుషులు గుర్తించరు. ఎందుకంటే, ఒక మహిళ చేయాల్సి వచ్చే అన్ని పనుల గురించి వాళ్లకి తెలియదు. కాబట్టి మీ పిల్లల కోసం ఒక బృందంగా పనిచేసేలా మీ మొత్తం కుటుంబాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేయండి.
3. మీ పిల్లలతో ఆడుకోవడానికి, వారిని చూసుకోవడానికి మీ భర్తను ప్రోత్సహించే ప్రయత్ననం చేయండి. శిశువులు మరియు చిన్న పిల్లలను చూసుకునే పని మహిళలదే అని చాలామంది పురుషులు భావిస్తారు. కానీ, అది తప్పు. ఎందుకంటే, పిల్లల పెంపకం మరియు విద్యలో తండ్రులు కూడా నిమగ్నమయ్యే పిల్లలు ఇతర పిల్లల కంటే బాగా అభివృద్ధి చెందుతారని మరియు వారు పెద్దయ్యాక మరింత తెలివైనవారవుతారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి, కనీసం రోజులో కొంతసేపు మీరు మీ బిడ్డతో ఆడుకోవడం, పాటలు పాడడం లేదా మాట్లాడడం లేదా స్నానం చేయించడం, మర్దన చేయడం లేదా శిశువును నిద్రపుచ్చడం చేయాల్సిందిగా మీ భర్తను అడగండి.
4. మీ సమస్యలను ఇతర మహిళలతో పంచుకోండి. మహిళలు తమ సమస్యలు గురించి ఇతరులతో చర్చించే విషయమై తరచుగా ఆందోళన చెందుతారు మరియు సిగ్గుపడతారు. ఎందుకంటే, తమను ఎవరూ అర్థం చేసుకోలేరని లేదా తమ ఇబ్బందుల గురించి మాట్లాడితే ఎదుటివారు తమను తక్కువగా చూస్తారని మహిళలు భావిస్తారు. అయితే, ఇతర మహిళలను కలవడానికి లేదా మాట్లాడటానికి ప్రయత్నించకపోవడం వల్ల, మహిళలు తమ సమాజంలో మద్దతు పొందడానికి మరియు ఇవ్వడానికి ఉండే అనేక అవకాశాలు కోల్పోతారు. మీ స్నేహితులు, స్నేహితుల స్నేహితులు, పొరుగువారు లేదా మీరు పనిచేసే చోట మహిళల్లో కొందరిని కలిసి, ఆహ్వానించడం ద్వారా, తమ సమస్యల గురించి మాట్లాడుకోవడానికి ఎప్పటికప్పుడు కలుసుకోగల ఒక చిన్న సమూహం ఏర్పాటు చేసేందుకు మహిళలు ప్రయత్నించవచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు వంట చేయడం లేదా పిల్లలను చూసుకోవడం వంటి పనులు పంచుకోవడంలో సైతం చాలామంది మీలాగే సమస్యలు ఎదుర్కొంటున్నారని మీరు తెలుసుకుంటారు. అదేసమయంలో, మీరు పరస్పరం ఆదుకునే మార్గాలు తెలుసుకునే అవకాశం ఉండొచ్చు.
5. మీ ఇంటి పనులన్నీ ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ, అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది మహిళలు తమ కుటుంబ అవసరాలు తీర్చడమే ముఖ్యమని, తమ సొంత అవసరాలను తీర్చుకునే హక్కు తమకు లేదని నమ్ముతారు. అది తప్పు. మహిళలు తమను తాము సరిగ్గా చూసుకోకపోతే మరియు తమ స్వంత అవసరాల మీద శ్రద్ధ చూపకపోతే వారు అనారోగ్యానికి గురవుతారు మరియు చివరికి వారి కుటుంబాలు వారిని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ మీ స్వంత ఆరోగ్యం మరియు శ్రేయస్సు చూసుకోవడం కోసం కూడా క్రమం తప్పకుండా కొంత సమయం వెచ్చించే ప్రయత్నం చేయండి.