ఇంటి పనుల విషయంలో సాధారణంగా తలెత్తే విభేదాలు ఏమిటి
అనేక దేశాల్లో, సాంప్రదాయకంగా స్త్రీలు మాత్రమే ఇంటిని చూసుకునే బాధ్యత నిర్వర్తిస్తుంటారు. భర్తని, అతని తల్లిదండ్రులను లేదా ఇతర బంధువులను, పిల్లలను మరియు అనారోగ్యంతో ఉన్నవారిని మరియు వృద్ధులను చూసుకోవడం మహిళల పనిగా ఉంటుంది. పొయ్యిలోకి కట్టెలు మరియు తాగునీరు తీసుకురావడం, వంట చేయడం మరియు పాత్రలు కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, తోటపని, పంట సాగు లాంటివన్నీ మహిళలే చేస్తారు. అలాగే, కుటుంబ సంరక్షణలోని ఏవైనా జంతువుల బాగోగులు కూడా సాధారణంగా మహిళలే చూసుకుంటారు.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పిల్లల సంరక్షణ సౌకర్యాలు మరియు/లేదా ఆరోగ్య మరియు సహాయక సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇంటి పనులతో పాటు, కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవడం కోసం ఒక మహిళ తన సమయం మొత్తం వెచ్చించాల్సి వస్తుంది. తద్వారా, డబ్బు అందించే ఉపాధి చేపట్టే ఆమె అవకాశాలు తీవ్రంగా పరిమితమవుతాయి.
బలమైన మరియు ఆరోగ్యకరమైన మహిళకు సైతం ఈ \"ఇంటి పనులు\" పెను భారం కావచ్చు. ఆ పనులన్నీ పూర్తి చేయడం కోసం ఆమె రోజంతా వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి, డబ్బు అందించే ఉపాధి చేపట్టే ఆమె సామర్థ్యం తీవ్రంగా పరిమితం చేయబడుతుంది. అదేసమయంలో, ఆ మహిళ బలహీనంగా లేదా అనారోగ్యంతో ఉంటే, పని బాధ్యతలు మోయడం ఆమెకు అసాధ్యం కావచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో, మహిళలు వారి భర్తలను సహాయం అడిగినప్పుడు, \"ఇంటి పనులను\" వాళ్లు \"ఆడవాళ్ల పని\"గా పరిగణిస్తారు. కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఇంటి నుండి దూరంగా పనిచేసే మహిళల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది.
అధ్యయనాలు పేర్కొంటున్న ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటి పనులు మరియు పిల్లలు మరియు వృద్ధులను చూసుకోవడం లాంటి జీతం లేని పనుల కోసం పురుషులతో పోలిస్తే, మహిళలు సగటున రోజుకు మూడు గంటలు ఎక్కువ పనిచేస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోని చాలామంది మహిళలు వాళ్లకు నచ్చినట్టుగా పనిచేసుకునే పరిస్థితి కూడా లేదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఇంకా, చాలా దేశాల్లో మహిళలు తరచుగా ఇంటిని నడపడం, పిల్లలను పెంచడం మరియు ప్రాథమిక సంరక్షణ ఇవ్వడం కోసం బాధ్యత వహిస్తున్నప్పటికీ, ముఖ్యమైన గృహ నిర్ణయాలు లేదా గృహంలో ఖర్చుల మీద వారి ప్రభావం తక్కువగానే ఉంటోంది మరియు తరచుగా వాళ్లని ఈ నిర్ణయాల నుండి దూరం పెట్టేస్తున్నారు.
కాబట్టి, తరచుగా, ఇంటి పని మరియు పిల్లల సంరక్షణ భారం మహిళల మీదే ఉంటోంది. అదేసమయంలో, ముఖ్యమైన నిర్ణయాలన్నీ ప్రత్యేకించి పురుషులు తీసుకుంటున్నారు. ఇది న్యాయమైన పరిస్థితి కాదు మరియు భాగస్వాముల మధ్య అనేక సంఘర్షణలకు దారితీస్తుంది.