ఎవరైనా వ్యక్తికి క్షయ వ్యాధి ఉందో లేదో నాకెలా తెలుస్తుంది
3 వారాలకు పైగా కొనసాగుతున్న దగ్గు, ప్రత్యేకించి, కఫం (ఊపిరితిత్తుల నుండి వచ్చే శ్లేష్మం)లో లో రక్తం కనిపించడమనేది క్షయకి సంబంధించిన సర్వసాధారణ లక్షణాలు. ఆకలి మరియు బరువు తగ్గడం, జ్వరం, అలసటగా అనిపించడం మరియు రాత్రిళ్లు చెమటలు పట్టడం లాంటివి ఇతర సంకేతాలుగా ఉంటాయి.
అయితే, ఒక వ్యక్తికి క్షయ ఉందని నిర్ధారించాలంటే, అతనికి కఫం పరీక్ష చేయడం ఒక్కటే మార్గం. కఫం (ఉమ్మి) నమూనా- లాలాజలం (ఎంగిలి) కాదు-తీయడం కోసం ఆ వ్యక్తి తన ఊపిరితిత్తుల నుండి కఫం బయటకు వచ్చేలా గట్టిగా దగ్గాలి. కఫంలో క్షయ క్రిములు ఉన్నాయా (పాజిటివ్ రావడం) అని ప్రయోగశాలలో పరీక్షిస్తారు.
గుర్తుంచుకోండి: హెచ్ఐవి ఉన్న వ్యక్తులు క్షయ బారిన పడడం సర్వసాధారణం కాబట్టి, హెచ్ఐవి ఉన్న వాళ్లందరికీ క్షయ నిర్ధారణ పరీక్ష చేయాలి. క్షయ పాజిటివ్ వస్తే, ఆ వ్యక్తికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. హెచ్ఐవి సర్వసాధారణంగా ఉండే దేశాల్లో, క్షయ ఉన్న ప్రజలందరూ హెచ్ఐవి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.