ఏదైనా ఒక పిల్ వేసుకోవడం మర్చిపోయినప్పుడు నేనేం చేయాలి
మీరు పిల్ వేసుకోవడం మర్చిపోతే, మీకు గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు 1 లేదా 2 పిల్స్ వేసుకోవడం మర్చిపోతే, మీకు ఆ విషయం గుర్తొచ్చిన వెంటనే 1 పిల్ వేసుకోండి. ఆ తర్వాత, రోజువారీ నిర్ధిష్ట సమయానికి మరొక పిల్ వేసుకోండి. అంటే, ఆ సందర్భంలో మీరు ఒకే రోజు 2 పిల్స్ వేసుకుంటారు. మీరు వరుసగా 3 రోజులు 3 పిల్స్ వేసుకోవడం మర్చిపోతే, ఆ విషయం గుర్తొచ్చిన వెంటనే 1 పిల్ వేసుకోండి. ఆ తర్వాత, ప్రతిరోజూ క్రమం తప్పకుండా 1 పిల్ వేసుకోండి.
మీరు 28 రోజుల పిల్స్ ప్యాకెట్ ఉపయోగిస్తుంటే, హార్మోన్ పిల్స్ మాత్రమే తీసుకోండి మరియు చక్కెర మాత్రలు వేసుకోకండి. ఆతర్వాత, కొత్త ప్యాకెట్ నుండి హార్మోన్ పిల్స్ తీసుకోవడంతో మొదలుపెట్టండి. మీరు 21 రోజుల ప్యాకెట్ ఉపయోగిస్తుంటే, ఆ ఉపయోగిస్తున్న ప్యాకెట్ పూర్తికాగానే, వెంటనే కొత్త ప్యాకెట్ ప్రారంభించండి. మీరు వరుసగా 7 రోజులు ప్రతిరోజూ ఒక పిల్ తీసుకునే వరకు కండోమ్ ఉపయోగించండి (లేదా సెక్స్ చేయకండి).
మీరు 3 కంటే ఎక్కువ పిల్స్ తీసుకోవడం మర్చిపోతే, పిల్స్ తీసుకోవడం ఆపేసి, మీ తదుపరి నెలసరి రక్తస్రావం కోసం వేచి చూడండి. అప్పటివరకు కండోమ్ ఉపయోగించండి (లేదా సెక్స్ చేయకండి). ఆతర్వాత, రక్తస్రావం మొదటిరోజు నుండి కొత్త ప్యాకెట్ ప్రారంభించండి.
పిల్స్ తీసుకోవడం ఆలస్యమైనప్పుడు లేదా తప్పిపోయినప్పుడు తక్కువ మొత్తంలో నెలసరి రక్తస్రావం జరిగినట్లుగా మీకు కొంచెం రక్తస్రావం కనిపించవచ్చు.
పిల్స్ తీసుకోవడం గుర్తుంచుకోవడంలో మీకు ఇబ్బంది ఉంటే, సాయంత్రం భోజనం సిద్ధం చేయడం లాంటి రోజువారీ పని చేస్తున్న సమయంలోనే పిల్ వేసుకోవడానికి ప్రయత్నించండి లేదా సూర్యుడు అస్తమించడం చూసినప్పుడు లేదా నిద్రపోయే ముందు పిల్ వేసుకోండి. ఆ ప్యాకెట్‌ని మీరు ప్రతిరోజూ చూడగలిగే చోట ఉంచండి. అయినప్పటికీ, పిల్స్ వేసుకోవడాన్ని తరచుగా (నెలకు ఒకటి కంటే ఎక్కువసార్లు) మర్చిపోతుంటే, వేరొక జనన నియంత్రణ పద్ధతికి మారడం గురించి ఆలోచించండి.
పిల్ వేసుకున్న 3 గంటల లోపు మీరు వాంతి చేసుకుంటే లేదా తీవ్రంగా విరేచనాలైతే, మీ జనన నియంత్రణ పిల్ మీ శరీరంలో నిలిచి ఉండి, చక్కగా పనిచేసే పరిస్థితి ఉండదు. కాబట్టి, మీరు మళ్లీ మామూలు స్థితికి వచ్చి, వరుసగా ఏడు రోజులు 7 పిల్స్ వేసుకునే వరకు కండోమ్‌లు ఉపయోగించండి లేదా సెక్స్‌కి దూరంగా ఉండండి.