ఏయే అంశాలు రక్తస్రావంలో మార్పులకు కారణం కాగలవు
అనారోగ్యం, ఒత్తిడి, గర్భధారణ, తల్లిపాలు ఇవ్వడం, సుదీర్ఘ ప్రయాణం, అధిక పని లేదా ఆహారంలో మార్పు లాంటి సందర్భాల్లో నెలసరి రక్తస్రావంలో మార్పులు సహజం. అయితే, నెలసరి రక్తస్రావంలో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తే, ఆ పరిస్థితి కొన్ని నెలలకు పైగా కొనసాగితే లేదా ఆ మార్పుతో పాటు ఇతర సమస్యలు కూడా ఉంటే, ఏదైనా తీవ్ర సమస్యకు అది సంకేతం కావచ్చు.
నెలసరి రక్తస్రావంలో అకస్మాత్తుగా మార్పు సంభవిస్తే, మీరు కుటుంబ నియంత్రణ పద్ధతి ఉపయోగిస్తున్నప్పటికీ, మీరు గర్భం దాల్చేరేమోనని అనుమానించండి.
కొన్నిసార్లు అండాశయం నుండి అండం విడుదల కాదు. ఇలా జరిగినప్పుడు, శరీరం తక్కువ ప్రొజెస్టెరాన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల, మహిళలో ఎంత తరచుగా మరియు ఎంత పరిమాణంలో రక్తస్రావం అవుతుందనే పరిస్థితిలో మార్పు రావచ్చు. ఇటీవలే నెలసరి రక్తస్రావం ప్రారంభమైన అమ్మాయిల్లో-లేదా ఇటీవలే పాలివ్వడం ఆపేసిన మహిళల్లో-ప్రతి కొన్ని నెలలకు ఒకసారి మాత్రమే రక్తస్రావం కనిపించవచ్చు లేదా చాలా తక్కువ రక్తస్రావం లేదా చాలా ఎక్కువ రక్తస్రావం కనిపించవచ్చు. అయితే, రోజులు గడిచేకొద్దీ వారి రుతుచక్రాలు క్రమబద్ధంగా మారుతాయి.
హార్మోన్లతో కుటుంబ నియంత్రణ పద్ధతి ఉపయోగించే మహిళల్లో కొన్నిసార్లు నెల మధ్యలో రక్తస్రావం కనిపించవచ్చు.
ఇంకా రుతువిరతి స్థితికి చేరుకోని పెద్ద వయసు మహిళల్లో వారి చిన్న వయస్సులో కంటే ఎక్కువ మొత్తంలో రక్తస్రావం కనిపించవచ్చు లేదా ఎక్కువ తరచుగా రక్తస్రావం కనిపించవచ్చు. వాళ్లు రుతువిరతికి దగ్గరయ్యే కొద్దీ, వాళ్లలో కొన్ని నెలల పాటు నెలవారీ రక్తస్రావం కనిపించకుండా ఉండడం, అటుమీదట మళ్లీ నెలసరి కనిపించడం జరగవచ్చు.