ఏవిధమైన గర్భస్రావ పద్ధతులు సురక్షితమైనవి

From Audiopedia
Jump to: navigation, search

ఒక శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ద్వారా, క్రింద పేర్కొన్న పద్ధతుల్లో గర్భాశయం నుండి గర్భం తొలగించవచ్చు:

సక్షన్ ద్వారా గర్భస్రావం (వాక్యూమ్ ఆస్పిరేషన్, MVA) యోని మరియు గర్భాశయ ముఖద్వారం గుండా గర్భాశయంలోకి చొప్పించే ప్రత్యేక గొట్టం (కానులా) ఉపయోగించి పీల్చినట్టు చేయడం ద్వారా గర్భం తొలగిస్తారు. ఆ మహిళకి మత్తు ఏదీ ఇవ్వకుండానే ఈ ప్రక్రియ చేస్తారు. అయితే, కొన్నిసార్లు నొప్పి తెలియకుండా ఉండడం కోసం గర్భాశయ ముఖద్వారం నుండి ఔషధం ఇంజెక్ట్ చేస్తారు. వాక్యూమ్ ఆస్పిరేషన్‌ను చేతితో (మాన్యువల్ వాక్యూమ్ ఆస్పిరేషన్ లేదా MVA) చేసినప్పుడు ఒక ప్రత్యేక సిరంజి ఉపయోగించి గర్భం తొలగిస్తారు. లేనిపక్షంలో, ఒక చిన్న విద్యుత్ యంత్రం ఉపయోగిస్తారు. MVA సరళమైన మరియు సురక్షితమైన ప్రక్రియ. 5 నుండి 10 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సాధారణంగా క్లినిక్ లేదా హెల్త్ పోస్ట్ లేదా డాక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ చేస్తారు. గర్భం దాల్చిన మొదటి 12 వారాల్లో (3 నెలల్లో) ఈ రకంగా గర్భస్రావం చేయడం సురక్షితం కాగలదు.

స్క్రాపింగ్ ద్వారా గర్భస్రావం (డైలేషన్ అండ్ క్యూరేటేజ్ లేదా D అండ్ C) గర్భాశయంలోకి చొప్పించడానికి అనువుగా తయారు చేసిన క్యూరేట్ అనే ఒక చిన్న స్పూన్ ఆకారంలోని ఉపకరణంతో గర్భం తొలగిస్తారు. క్యూరెట్ అనేది కాన్యులా కంటే పెద్దది మరియు పదునుగా ఉంటుంది కాబట్టి, ముందుగా గర్భాశయ ముఖద్వారం తెరచి ఉంచాలి. ఇలా చేసినప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది.D అండ్ C చేయడానికి ఎక్కువ సమయం (సుమారు 15 నుండి 20 నిమిషాలు) పడుతుంది. ఇది వాక్యూమ్ కంటే ఎక్కువ నొప్పితో మరియు ఖర్చుతో కూడినది. సాధారణంగా శస్త్రచికిత్స గదిలో ఈ ప్రక్రియ చేస్తారు మరియు స్త్రీని మత్తులో ఉంచడం కోసం మత్తు ఇస్తారు.

ఔషధం ఇవ్వడం ద్వారా గర్భస్రావం (మెడికల్ అబార్షన్) ప్రస్తుతం గర్భస్రావం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలు కొన్ని రకాల ఆధునిక ఔషధాలు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియను మెడికల్ అబార్షన్ అంటారు. ఈ ఔషధాల వల్ల గర్భాశయం కుచించుకోవడం వల్ల, గర్భం బయటకు నెట్టివేయబడుతుంది. ఈ ఔషధాలు మింగేవిగా లేదా నోటిలో కరిగిపోయేవిగా ఉంటాయి. సరైన ఔషధాలను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే, మెడికల్ అబార్షన్ చాలా ప్రభావవంతంగా మరియు సురక్షితంగా ఉంటుంది. గర్భాశయం లోపలకు ఏ ఉపకరణాలూ చొప్పించరు కాబట్టి, అసురక్షిత గర్భస్రావం ప్రక్రియలో లాగా ఆ మహిళ చనిపోవడం లేదా ఇన్ఫక్షన్‌కు గురయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.

Sources
  • Audiopedia ID: tel020207