ఒక మహిళ తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకోవడానికి ఏ ఇతర కారణాలు ఉండవచ్చు
ఘాతం: చాలామంది మహిళలు వారి జీవితాలను అంతం చేసుకోవాలనుకోవడానికి మరొక కారణం వాళ్లకి ప్రతికూల జీవిత సంఘటన ఎదురుకావడం మరియు దానిని ఎలా ఎదుర్కోవాలో వాళ్లకి తెలియకపోవడం. ఘాతం అనేది ఒక వ్యక్తికి అపారమైన శారీరక మరియు/లేదా మానసిక ఒత్తిడిని కలిగించే సంఘటన లేదా సంఘటనలుగా ఉంటాయి. అవి జీవితాన్ని భరించడాన్ని కష్టతరం చేస్తాయి మరియు శాశ్వత నష్టం మిగులుస్తాయి.
ఇంట్లో హింస, అత్యాచారం, యుద్ధం, చిత్రహింసలు మరియు ప్రకృతి విపత్తులు లాంటివి ఘాతం కలిగించే సర్వసాధారణ కారణాలుగా ఉంటాయి. ఒక మహిళకు ఘాతం కలిగించే ఇతర ప్రతికూల జీవిత సంఘటనల్లో వాళ్లకి ఇష్టమైన ఎవరినైనా కోల్పోవడం మరియు/లేదా మరణం లేదా వాళ్లు ప్రాణంగా భావించే ఏదైనా (ఉదాహరణకు: తల్లిదండ్రులు, భర్త లేదా బిడ్డ మరణం, ఉద్యోగాలు లేదా ఇళ్లు కోల్పోవడం) దూరం కావడం, దీర్ఘకాలిక శారీరక అనారోగ్యం మరియు వైకల్యం తీవ్రం కావడం లాంటివి ఉంటాయి. కొంతమంది మహిళలు ఈ పరిస్థితుల్లో దుఃఖం, విచారం లేదా భయంతో మునిగిపోయి, తమకు ఆత్మహత్య ఒక్కటే మార్గం అనే స్థితిలోకి వెళ్లిపోతారు.
కుంగుబాటు లేదా ఆదుర్దా: మహిళలు నిరాశలో కూరుకుపోవడానికి ఎల్లప్పుడూ ప్రతికూల జీవిత సంఘటన లేదా ఘాతం ఎదురు కావాల్సిన అవసరం లేదు. చాలామంది మహిళలు వారి రోజువారీ జీవితంలో అనుభవించే స్థిరమైన, అధిక స్థాయి ఒత్తిడి వారిలో నిరాశ లేదా ఆందోళన లేదా రెండింటినీ కలిగిస్తుంది.
కుంగుబాటు అనేది మానసిక స్థితి నిరాశగా ఉండడం లేదా ఆ వ్యక్తి ప్రవర్తన, ఆలోచనలు, భావాలు మరియు దీర్ఘకాలంలో వారి శ్రేయస్సును ప్రభావితం చేసే కార్యకలాపాల పట్ల విరక్తిగా ఉండడం లాంటి వాటితో ముడిపడి ఉంటుంది. వైద్య రంగంలో దీనినే డిప్రెసివ్ డిజార్డర్ అని పిలుస్తారు. ఇది 'మనసులో భారాన్ని' పెంచుతుంది లేదా 'స్ఫూర్తి మరియు మనోస్థైర్యం కోల్పోయేలా' చేస్తుంది.
మరోవైపు ఆందోళన రుగ్మత అనేది చాలాకాలం పాటు భయం, ఆందోళన మరియు సాధారణ అసౌకర్యం లాంటి అనుభూతి కలిగిస్తుంది. ఆందోళన రుగ్మతకు సంబంధించి తరచుగా 'నెర్వస్', 'నెర్వస్ అటాక్' మరియు 'మానసిక బాధలు' అనే పదాలు ఉపయోగిస్తుంటారు. ఒక మహిళ ప్రతిరోజూ మరియు దీర్ఘకాలం పాటు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు, ఆమెలో నిరుత్సాహం మొదలవుతుంది. తద్వారా, తాను చేయాల్సిన పనులు మరియు ఎదుర్కోవాల్సిన సమస్యలతో (ఉదా. అధిక పని, డబ్బు లేదా ఆహారం లేకపోవడం, కుటుంబం లేదా వైవాహిక జీవితంలో సమస్యలు మొదలైనవి) పోరాడడం ఆమెకి సాధ్యం కాదు.
బాధిత మహిళకు సహాయం మరియు మద్దతు లభించనప్పుడు నిరాశ మరియు ఆందోళన రెండూ ఆత్మహత్య ఆలోచనకు దారితీయవచ్చు. ఇతరుల క్షేమం చూసిన తర్వాతే, తన క్షేమం చూసుకోవాలనే పరిస్థితి (సాధారణంగా, చాలామంది మహిళలకు ఉన్నట్టుగానే) ఆమెకి ఉంటే, ఆమె తన అవసరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లో మానసిక ఆరోగ్య సహాయం లేకపోవడం వల్ల నిరాశ, ఆందోళన లేదా ఘాతం లాంటి మానసిక సమస్యలు మరియు అనారోగ్యాల విషయంలో సహాయం మరియు వృత్తిగత సహాయం కోసం మహిళ కోరుకున్నప్పటికీ, తరచుగా వాటిని గుర్తించే లేదా తగినవిధంగా చికిత్స చేసే పరిస్థితి ఉండదు.