ఒక సంతృప్తికరమైన లైంగిక సంబంధం కోసం నేను ప్రయత్నించవచ్చా
వైకల్యం కలిగిన మహిళలకు భావాలు ఉండవనీ లేదా ఉండకూడదనీ చాలా మంది నమ్ముతారు. సన్నిహితమైన, ప్రేమపూర్వకమైన సంబంధాలను లేదా మాతృత్వాన్ని వాళ్లు కోరుకోకూడదని భావిస్తారు. కానీ, వైకల్యాలున్న మహిళలకు సైతం అందరి లాగే సాన్నిహిత్యం మరియు లైంగిక పరమైన కోరిక ఉంటుంది.
మీరు వైకల్యంతో జన్మిస్తే లేదా చాలా చిన్న వయస్సులోనే మీకు వైకల్యం ఏర్పడితే, మీరు కూడా ఆకర్షణీయంగానే ఉన్నారని నమ్మడం మీకే కష్టంగా అనిపించవచ్చు. ఈ పరిస్థితిలో వైకల్యాలున్న ఇతర మహిళలతో మీ భయాల గురించి మాట్లాడడం ద్వారా, ఆవిధమైన భయాలను వాళ్లెలా అధిగమించారో తెలుసుకోవచ్చు. మీ గురించి భిన్నంగా భావించడం నేర్చుకోవడంలో తరచుగా అది మీకు ఉత్తమ మార్గం కాగలదు. అయితే, ఓపికగా ఉండాలని గుర్తుంచుకోండి. మీలో చాలాకాలంగా ఉన్న నమ్మకాల్లో మార్పు రావడానికి సమయం పడుతుంది.
మీకు కొత్తగా వైకల్యం సంభవించి ఉంటే, లైంగికపరమైన ఆలోచనలనేవి మీలో అప్పటికే ఉన్నప్పటికీ, మీరు కూడా లైంగికంగా ఆనందించడం కొనసాగించవచ్చని మీరు గ్రహించలేకపోవచ్చు. ఇకపై మీరు ఆకర్షణీయంగా ఉండరని మీరు అనుకోవచ్చు మరియు కొత్తగా వచ్చిన మార్పు మీలో బాధ కలిగించవచ్చు.
వైకల్యం లేని మహిళలు చదివే అదే లైంగిక విజ్ఞానాన్ని వైకల్యం కలిగిన మహిళలు కూడా చదవడం ద్వారా, ఆ విషయంలో వారికి అది సహాయపడవచ్చు. లైంగికపరమైన అంశాల గురించి వారితో మరియు విశ్వసనీయ ఉపాధ్యాయులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు మరియు వైకల్యంతో ఉన్న ఇతర మహిళలతో మాట్లాడటానికి ప్రయత్నించండి.
మీరు మరియు మీ భాగస్వామి ఒకరినొకరు ఎలా సంతోషపెట్టుకోవచ్చనే దానిమీద ప్రయోగాలు చేయండి. ఉదాహరణకు, రతి సమయంలో మీ చేతులు లేదా జననేంద్రియాల నుండి ఎలాంటి అనుభూతి లేకపోతే, అలాంటి అనుభూతి అందించే చెవి, రొమ్ము లేదా మెడ లాంటి ఇతర శరీర భాగాలను మీరు ప్రేరేపించవచ్చు. వైకల్యం కారణంగా, యోని ద్వారా రతి అసౌకర్యంగా ఉన్నప్పుడు ఈ పద్ధతి సహాయపడగలదు. పక్కకి పడుకోవడం లేదా కుర్చీ అంచున కూర్చోవడం లాంటి విభిన్న భంగిమలు కూడా మీరు ప్రయత్నించవచ్చు. మీరు, మీ భాగస్వామి కలిసి నిజాయితీగా మాట్లాడుకోగలిగితే, మీ మధ్య సంతృప్తికర బంధం ఏర్పడగలదు. అదేసమయంలో, మీరు కోరుకున్న దానికంటే తక్కువ తృప్తితో సరిపెట్టుకోవాల్సిన లేదంటే, మీ గురించి పట్టించుకోని వ్యక్తితో లైంగిక సంబంధానికి సిద్ధపడాల్సిన అగత్యం మీకు లేదని గుర్తుంచుకోండి.