కండోమ్ ఉపయోగించే విధంగా నా భాగస్వామిని నేనెలా ఒప్పించగలను
అంటువ్యాధులు మరియు అవాంఛిత గర్భధారణను నిరోధించడానికి కండోమ్‌లు ఉపయోగించడం ఒకానొక సులభమైన మార్గం. కానీ, చాలామంది వాటిని ఉపయోగించడానికి మొదట్లో ఇష్టపడరు. కండోమ్‌లు గురించి వినిపించే కొన్ని సాధారణ ఫిర్యాదులకు ప్రతిస్పందనలు ఇక్కడ చూడండి:
\"గతంలో నేను వాటిని ప్రయత్నించాను. నాకు అవి నచ్చలేదు\".
కండోమ్ ఉపయోగించడం అలవాటు పడటానికి కొన్నిసార్లు సమయం పడుతుంది. కొన్ని వారాల పాటు వాటిని ఉపయోగిస్తానని అంగీకరించడానికి ప్రయత్నించండి. సాధారణంగా, కండోమ్ ఉపయోగించినప్పటికీ, అంతే ఆనందంగా ఉంటుందని భాగస్వాములిద్దరూ గ్రహిస్తారు.
\"కండోమ్ వేసుకుంటే, నాకు ఎలాంటి అనుభూతి కలగడం లేదు\". వాటర్-బేస్డ్ లూబ్రికెంట్‌ను ధారాళంగా ఉపయోగించండి. భాగస్వాములిద్దరికీ మంచి అనుభూతి కలిగించడంలో ఇది సహాయపడుతుంది. కండోమ్ వేసుకోవడానికి ముందు దాని కొన లోపల ఒక చుక్క లూబ్రికెంట్ వేయండి. కండోమ్ వేసుకున్నప్పుడు కాస్త భిన్నంగా అనిపించడం నిజమే. కానీ, అస్సలు కండోమ్ వేసుకోకుండా సెక్స్ చేయడం కంటే, కండోమ్ వేసుకుని పాల్గొనడమే మంచిదని చాలామంది అంగీకరిస్తారు! కొందరు పురుషుల్లో ఎక్కువసేపు అంగం గట్టిగా ఉండడానికి కూడా కండోమ్ సహాయపడుతుంది.
\"గతంలో మేమెప్పుడూ కండోమ్ ఉపయోగించలేదు. మరి ఇప్పుడెందుకు ఆవిధంగా చేయాలి?\"
అసురక్షిత లైంగిక ప్రక్రియ వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి మీకిప్పుడు అధిక సమాచారం తెలుసని చెప్పండి. కాబట్టి, ఒకరినొకరు రక్షించుకోవడానికి అదొక మంచి ఆలోచన అని చెప్పండి. మీరు మీ కుటుంబ నియంత్రణ పద్ధతి మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా చెప్పవచ్చు.
\"అది వేసుకోవడం కోసం నేను చేస్తున్న పని ఆపడం నాకిష్టం లేదు\".
మీరు సాధారణంగా సెక్స్ చేసే ప్రదేశాల్లో కండోమ్‌లు అందుబాటులో ఉంచండి. తద్వారా, కండోమ్ కోసం మీరు దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. పురుషుడి అంగం గట్టిపడగానే మీరు దానికి కండోమ్ వేయవచ్చు. అటుపై, ఒకరినొకరు తాకడం మరియు ఆడుకోవడం కొనసాగించవచ్చు. స్త్రీ కండోమ్‌లు మీకు అందుబాటులో ఉంటే, వాటిని కొనే స్థోమత ఉంటే వాటిని ప్రయత్నించండి. వాటిని మీరు ముందే లోపల పెట్టేసుకోవచ్చు.
\"కండోమ్‌లు కొనేందుకు నాకు స్థోమత లేదు\" లేదా అవి నాకు అందుబాటులో లేవు.
అనేక ఆరోగ్య కేంద్రాలు మరియు ఎయిడ్స్ నిరోధ సంస్థల్లో కండోమ్‌లు ఉచితంగా లేదా చాలా చౌకగా ఇస్తారు. ప్రతిసారీ కొత్త కండోమ్ ఉపయోగించడం మంచిది. అయితే, అస్సలు కండోమ్ వేసుకోకపోవడం కంటే, దాన్ని మళ్లీ ఉపయోగించడం మంచిదే. కండోమ్‌ని మీరు మళ్లీ ఉపయోగించాల్సి వస్తే, సబ్బు మరియు నీటితో దాన్ని జాగ్రత్తగా కడగండి. దానిని ఆరబెట్టి, మళ్లీ రింగులా చుట్టండి. చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి. ప్రమాదం తగ్గించడానికి ఇతర మార్గాలు ఉపయోగించండి. ఉదాహరణకు, పురుషుడు స్కలనానికి ముందు అంగం బయటకు తీసేస్తే, అది స్త్రీ మరియు పురుషుడు ఇద్దరికీ సురక్షితం. మీకు కండోమ్ అందుబాటులో లేకపోతే, పల్చటి, సౌకర్యవంతమైన ప్లాస్టిక్ కాగితాన్ని అంగానికి చుట్టండి.
\"దానివల్ల సానిహిత్యం భావన కలగదు\".
కండోమ్‌లని సెక్సీగా ఉపయోగించే ప్రయత్నం చేయండి. కండోమ్ వేసుకోవడానికి వివిధ మార్గాలు నేర్చుకోండి. అటుపై, సెక్స్‌కి ముందు మీ శృంగార చర్యల్లో దాన్నీ ఒక భాగం చేసుకోండి. మీ భాగస్వామి స్వీయ నియంత్రణ మీద మీకు విశ్వాసం ఉంటే మరియు HIV, ఇతర STIల కోసం పరీక్షలు చేయించుకోగలిగితే, భవిష్యత్తులో కండోమ్‌లు ఉపయోగించడం మానేయడం కోసం మీరొక ప్రణాళిక చేసుకోవచ్చు. మీరిద్దరూ పరీక్షలు చేయించుకోవాలి. 6 నెలలు కండోమ్ ఉపయోగించడం కొనసాగించాలి. అటుపై, మళ్లీ పరీక్షలు చేయించుకోవాలి. అదేసమయంలో, భద్రత, నిజాయితీ, విశ్వసనీయంగా ఉండడం మరియు మీలో ఎవరైనా, ఎప్పుడైనా వేరొక వ్యక్తితో సెక్స్‌లో పాల్గొంటే, ఆ సమయంలో కండోమ్ వేసుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి చర్చించండి.