క్యాన్సర్ అంటే ఏమిటి
క్యాన్సర్ అనేది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేయగల ఒక తీవ్రమైన వ్యాధి. ప్రారంభ దశలోనే చికిత్స చేయడం ద్వారా, తరచుగా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. అయితే, దీర్ఘకాలం పట్టించుకోకపోతే, అది మరణానికి దారితీస్తుంది. ప్రత్యేకించి, ఆరోగ్య సంరక్షణకు తక్కువ ప్రాప్యత కలిగిన చాలామందికి క్యాన్సర్ వచ్చినప్పుడు, ఆ కారణంగా వాళ్లు చనిపోతుంటారు.
మానవ శరీరంతో సహా, అన్ని జీవులూ అత్యంత సూక్ష్మ కణాలతో తయారవుతాయి. సూక్ష్మదర్శిని లేకుండా ఈ కణాలను చూడడం సాధ్యం కాదు. కొన్నిసార్లు, ఈ కణాలు అసాధారణ రీతిలో మార్పు చెంది, పెరగడం మొదలుపెడుతాయి. తద్వారా, పెరుగుదలు (కణితులకు) సంభవిస్తాయి. చికిత్స అవసరం లేకుండానే కొన్ని పెరుగుదలలు కాలక్రమంలో తగ్గిపోయినప్పటికీ, కొన్ని పెరుగుదలలు మరింత పెద్దవి కావడం లేదా వ్యాప్తి చెందడం ద్వారా ఆరోగ్య సమస్యలకు కారణం కాగలవు. చాలా పెరుగుదలలు క్యాన్సర్లుగా మారనప్పటికీ, కొన్ని మాత్రం క్యాన్సర్‌గా మారుతుంటాయి.
కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరగడం ద్వారా, శరీర భాగాలను కబళించినప్పుడు క్యాన్సర్ మొదలవుతుంది. క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించగలిగితే, తరచుగా దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు లేదా మందులు లేదా రేడియేషన్‌తో చికిత్స చేయవచ్చు మరియు అది నయమయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే, క్యాన్సర్ వ్యాపించడం మొదలైనప్పుడు దానిని నయం చేయడం మరింత కష్టమవుతుంది. కొన్నిసార్లు అసాధ్యంగా మారుతుంది.
గర్భాశయ ముఖద్వారం, రొమ్ము మరియు గర్భాశయానికి వచ్చే క్యాన్సర్లు సర్వసాధారణంగా 'మహిళల'కు వస్తుంటాయి. ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, కాలేయం, కడుపు, నోరు మరియు చర్మానికి వచ్చే క్యాన్సర్లు పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ రాగల ఇతర సాధారణ క్యాన్సర్లుగా ఉంటాయి.