గర్భస్రావం చేయించుకోవాలనే మీ నిర్ణయం తరచుగా మీరు నివసించే చోట సురక్షిత గర్భస్రావం అందుబాటులో ఉందా, లేదా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. మీ జీవితానికి గర్భస్రావం మంచిదా లేదంటే శిశువుని ప్రసవించడమే మంచిదా అనే దానిమీద కూడా అది ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించడం మీకు సహాయపడవచ్చు:
ఆ శిశువుని సంరక్షించగల శక్తి మీకు ఉందా?
ఒక బిడ్డను పెంచి, పెద్ద చేయడానికి అవసరమైన డబ్బు మీ దగ్గర ఉందా?
ఆ గర్భం మీ ఆరోగ్యానికి ప్రమాదకరమా?
బిడ్డను పోషించడం కోసం మీకు భాగస్వామి లేదా భర్త ఉన్నాడా?
ఈ నిర్ణయం గురించి మీరు అతనితో మాట్లాడగలరా?
గర్భస్రావాన్ని మీ మతం లేదా మీ కుటుంబం వ్యతిరేకిస్తుందా?
అవును అయితే, గర్భస్రావం చేయించుకోవడం గురించి మీరేమనుకుంటున్నారు?
మీరు ఏవిధంగా గర్భస్రావం చేసుకోగలరు?
మీకు గర్భం వచ్చి ఎంతకాలమైంది?
మీకు సాంక్రమిక ఇన్ఫెక్షన్ (STI) లేదా HIV ఉండే అవకాశం ఉందా? మీరు వయసులో చిన్నవారైతే, ఒంటరిగా ఉండడం, కొత్త భాగస్వామితో ఉండడం లేదా మీకు STI సంకేతాలు ఉంటే, మీకు STI వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. ఆవిధంగా, మీకు ప్రమాదం ఉందని మీరు భావిస్తే, గర్భస్రావం కంటే ముందు మీకు చికిత్స అవసరం కావచ్చు.
గర్భస్రావం వల్ల ఏ ఇబ్బందులు (సమస్యలు) రావచ్చు? మీకు HIV లేదా ఎయిడ్స్ ఉంటే, అసురక్షిత గర్భస్రావంతో వచ్చే ప్రమాదాల తీవ్రత మరింత పెరగవచ్చు.
మీకు సమస్యలు ఎదురైతే, అత్యవసర సంరక్షణ కోసం మీరు ఎక్కడికి వెళ్లగలరు? మీరు అక్కడికి ఎలా చేరుకోగలరు?
సురక్షిత గర్భస్రావం అందుబాటులో లేనప్పుడు, మీకు మరియు మీ సమాజానికి ఆమోదయోగ్యమైన పక్షంలో, ప్రసవం తర్వాత మీ శిశువును ఇతరులకి దత్తత ఇచ్చే ఎంపిక గురించి కూడా మీరు ఆలోచించవచ్చు.