తక్కువ డబ్బుతోనే నేనెలా మెరుగ్గా తినగలను

From Audiopedia
Jump to: navigation, search

డబ్బు పరిమితంగా ఉన్నప్పుడు దానిని తెలివిగా ఉపయోగించడం చాలా ముఖ్యం. తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లను పొందడానికి ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి:

ప్రోటీన్ ఆహారాలు బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు మరియు ఇతర సారూప్య ఆహారాలు (చిక్కుళ్ళు అని పిలుస్తారు) ప్రోటీన్లకి మంచి, చౌకైన వనరులుగా ఉంటాయి. వంట చేయడానికి మరియు తినడానికి ముందు ఇవి మొలకెత్తేలా చేయగలిగితే, వాటిలో ఎక్కువ విటమిన్లు ఉంటాయి. జంతు ప్రోటీన్లకు చౌకైన వనరుల్లో గుడ్లు ప్రధానంగా చెప్పవచ్చు. కాలేయం, గుండె, మూత్రపిండాలు, రక్తం మరియు చేపలు లాంటివి తరచుగా ఇతర మాంసాల కంటే చౌకైనవి మరియు అంతే పోషకమైనవిగా ఉంటాయి.

ధాన్యాలు మరపట్టే సమయంలో బియ్యం, గోధుమలు మరియు ఇతర ధాన్యాల మీది పొట్టు తొలగించకపోతే అవి మరింత పోషకమైనవిగా ఉంటాయి.

పండ్లు మరియు కూరగాయలు పండ్లు మరియు కూరగాయలు కోత కోసిన తర్వాతి నుండి మీరు వాటిని ఎంత త్వరగా తింటారో వాటిలో అంత ఎక్కువ పోషకాలు ఉంటాయి. విటమిన్లను సంరక్షించడానికి వాటిని చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయండి. కూరగాయల నుండి వచ్చే విటమిన్లు వంట చేసేటప్పుడు నీటిలోకి వెళ్తాయి కాబట్టి వీలైనంత తక్కువ నీటిలో కూరగాయలు ఉడికించండి. ఆ నీటిని కూడా సూప్‌లలో ఉపయోగించండి లేదా త్రాగండి.

క్యారెట్లు లేదా కాలీఫ్లవర్ లాంటి కూరగాయల్లో కఠినంగా ఉండే వెలుపలి ఆకులు లేదా పైభాగాల్లో అనేక విటమిన్లు ఉంటాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన సూప్‌లు తయారు చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, కసావా (మానియోక్) ఆకుల్లో వాటి వేళ్లలో కంటే 7 రెట్లు ఎక్కువ ప్రోటీన్ మరియు ఎక్కువ విటమిన్లు ఉంటాయి. అడవిలో లభించే అనేక పండ్లు మరియు బెర్రీల్లో విటమిన్ సి మరియు సహజ చక్కెరలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అదనపు విటమిన్లు మరియు శక్తిని అందించగలవు.

మీకు కొంత స్థలం ఉంటే, మీరే స్వంతంగా కూరగాయలు పండించడం వల్ల మీకు చాలా తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది.

పాలు మరియు పాల ఉత్పత్తులు వీటిని చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచాలి. శరీర నిర్మాణానికి అవసరమయ్యే ప్రోటీన్లు మరియు కాల్షియం వీటిలో పుష్కలంగా ఉంటాయి.

ప్యాకేజీ చేసిన ఆహారాలు లేదా విటమిన్ల కోసం డబ్బు ఖర్చు చేయడం మానుకోండి. తల్లిదండ్రులు తరచుగా స్వీట్లు లేదా సోడాలు (ఫిజ్జీ డ్రింక్స్) కోసం ఉపయోగించే డబ్బుతో పోషకాలతో నిండిన ఆహారాల కోసం ఖర్చు చేస్తే, వారి పిల్లలు అదే స్థాయిలో ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది ప్రజలు ఆహారం నుండి అవసరమైన విటమిన్లను పొందగలరు కాబట్టి, మాత్రలు లేదా ఇంజెక్షన్ల కంటే పోషకమైన ఆహారాల కోసం డబ్బు ఖర్చు చేయడం మంచిది. మీరు విటమిన్లు తీసుకోవాల్సి వస్తే, మాత్రలు తీసుకోండి. అవి కూడా ఇంజెక్షన్లు లాగే పనిచేస్తాయి. అలాగే అవి సురక్షితమైనవి మరియు తక్కువ ఖర్చుతో లభిస్తాయి.

Sources
  • Audiopedia ID: tel010411