తల్లిపాలు కాకుండా ఇతర రకాల పాలు ఇవ్వడం హానికరమా ఎందుకు
కృత్రిమ పాలు (శిశువుల కోసం ఫార్ములా) తయారు చేసే కంపెనీలు వాటి ఆదాయం కోసం తల్లులు వారి పిల్లలకు తల్లిపాలు బదులుగా ఫార్ములా పాలు తాగించాలని కోరుకుంటాయి. సీసా పాలు లేదా ఫార్ములా పాలు తాగించడమనేది చాలా సందర్భాల్లో ఏమాత్రం సురక్షితం కాదు. సీసా పాలు లేదా ఫార్ములా పాలు తాగించిన లక్షలాది మంది శిశువుల్లో పోషకాహార లోపం లేదా అనారోగ్యం లేదా మరణం నమోదైంది.
ఫార్ములా పాలు మరియు డబ్బా పాలు లేదా జంతువుల పాలు లాంటివి ఇతర రకాల పాలు తాగిస్తే, పిల్లలకు వ్యాధి నుండి రక్షణ లభించదు.
ఫార్ములా పాలు మరియు ఇతర పాలు అనారోగ్యం మరియు మరణానికి కారణమవుతాయి. పాల సీసా, పాల పీక లేదా ఫార్ములా పాలు తయారీకి ఉపయోగించే నీళ్లు ఎక్కువసేపు ఉడకబెట్టకపోతే, హానికర సూక్ష్మక్రిములు శిశువు పొట్టలోకి వెళ్లడం వల్ల అతిసారం వస్తుంది.
తల్లి పాలు త్రాగేటప్పుడు, రొమ్ము నుండి పాలు పీల్చడం కోసం శిశువు తన నాలుక ఉపయోగిస్తుంది. అయితే, సీసా నుండి పాలు పీల్చడం కోసం శిశువు తన నోరు ఉపయోగించాల్సిన పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. సీసా పాలు పీల్చే శిశువు తన తల్లి రొమ్ము నుండి పాలు ఎలా పీల్చాలో మర్చిపోవచ్చు. శిశువు తగినంత స్థాయిలో రొమ్ము నుండి పాలు పీల్చకపోతే, తల్లిలో పాలు ఉత్పత్తి తగ్గిపోతుంది మరియు శిశువుకి తల్లిపాలు పూర్తిగా దూరమవుతుంది.
సీసా పాలు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. ఒక బిడ్డ కోసం, మొదటి సంవత్సరంలో ఒక కుటుంబం 40 కిలోల ఫార్ములా పౌడర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక రోజుకి అవసరమయ్యే ఫార్ములా పౌడర్ కొనడానికి అయ్యే ఖర్చు మరియు దానిని కరిగించడం కోసం నీళ్లు మరిగించడానికి అయ్యే ఇంధనం ఖర్చు కలసి కొన్ని కుటుంబాల వారం సంపాదన లేదా నెల సంపాదన కంటే ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి, ఫార్మూలా పౌడర్ ఎక్కువ రోజులు రావడం కోసం కొందరు తల్లిదండ్రులు తక్కువ పౌడర్‌లో ఎక్కువ నీళ్లు కలుపుతుంటారు. దీనివల్ల శిశువులో పోషకాహార లోపం తలెత్తుతుంది. శిశువు పెరుగుదల నెమ్మదిస్తుంది మరియు ఆ శిశువులు తరచుగా అనారోగ్యానికి గురవుతుంది.
గుర్తుంచుకోండి: శిశువుకి జన్మనిచ్చిన మహిళకి HIV ఉంటే, తన బిడ్డకి పాలిచ్చే సురక్షిత మార్గం గురించి తప్పక నిర్ణయం తీసుకోవాలి. మీకు HIV ఉంటే, ఈ విషయం గురించి ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడండి.