తినడానికి సంబంధించి ఏ ఆలోచనలు హానికరమైనవి
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, మహిళలు మరియు ఆహారం గురించి కొన్ని సంప్రదాయాలు మరియు నమ్మకాలనేవి సహాయపడటం కంటే ఎక్కువగా హాని చేసేవిగా ఉంటాయి. ఉదాహరణకు:
బాలుర కంటే బాలికలకు తక్కువ ఆహారం సరిపోతుందనే మాట వాస్తవం కాదు.
అబ్బాయిలకే ఎక్కువ ఆహారం కావాలని కొందరు ప్రజలు విశ్వసిస్తారు. నిజానికి, వాళ్ల ఆలోచన తప్పు! చాలా సమాజాలలో మహిళలు కూడా పురుషుల మాదిరిగానే కష్టపడి పనిచేస్తారు. ఒకవేళ వాళ్లు కష్టం చేయనప్పటికీ, వాళ్లు ఆరోగ్యంగా ఉండాలి. బాల్యంలో ఆరోగ్యకరమైన మరియు మంచి ఆహారం తీసుకున్న బాలికలు ఆరోగ్యకరమైన మహిళలుగా ఎదుగుతారు. పాఠశాలలో మరియు పనిలో తక్కువ సమస్యలు కలిగి ఉంటారు.
గర్భధారణ సమయంలో మరియు తల్లిపాలు ఇచ్చే సమయంలో మహిళలు కొన్ని ఆహారాలు తినకూడదనే మాట నిజం కాదు.
కొన్ని సమాజాల్లో, ఒక మహిళ తన జీవితంలోని వేర్వేరు సమయాల్లో బీన్స్, గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పండ్లు లేదా కూరగాయలు లాంటి కొన్ని ఆహారాలు తినకూడదని ప్రజలు విశ్వసిస్తారు. నెలసరి రక్తస్రావం, గర్భం, ప్రసవం తర్వాత, తల్లిపాలు ఇచ్చే సమయంలో లేదా రుతువిరతి లాంటి సమయాలుగా వీటిని పేర్కొంటారు. అయితే, ఒక మహిళకు ప్రత్యేకించి, గర్భధారణ సమయంలో మరియు పాలిచ్చే సమయంలో ఈ ఆహారాలు మరింత ముఖ్యం. వాటిని తినకపోవడం వల్ల బలహీనత, అనారోగ్యం మరియు మరణం కూడా సంభవించవచ్చు.
ఒక మహిళ మొదట తన కుటుంబ పోషణకే ప్రాముఖ్యం ఇవ్వాలి.
ఒక మహిళ తనకంటే ముందు తన కుటుంబ పోషణకే ప్రాముఖ్యం ఇవ్వాలని కొన్ని సందర్భాల్లో చెబుతుంటారు. తద్వారా, ఇంట్లోని అందరూ తిన్న తర్వాత మిగిలిన దాన్ని మాత్రమే ఆమె తింటుంది కాబట్టి, ఆమెకి తగినంత ఆహారం లభించదు. ఇది ఎప్పటికీ ఆరోగ్యకరమైన విషయం కాదు మరియు ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో అది చాలా ప్రమాదకరం కావచ్చు.
ఒక మహిళ చక్కగా తినడంలో ఆమె కుటుంబం సహాయం చేయకపోతే, తగినంత ఆహారం తినడం కోసం ఆమె చేయాల్సిందంతా చేయాల్సిందిగా మేము ఆమెను ప్రోత్సహిస్తాము. ఆమె వంట చేసేటప్పుడు తినవచ్చు లేదా ఆహారం దాచిపెట్టుకుని తన భర్త ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు తినవచ్చు.
ఆరోగ్యవంతుడైన వ్యక్తి కంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తక్కువ ఆహారం సరిపోతుంది.
మంచి ఆహారం అనేది వ్యాధిని నివారించడమే కాకుండా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తన వ్యాధితో పోరాడటానికి మరియు తిరిగి కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. సాధారణ నియమం ప్రాకారం, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారికి ఏ ఆహారం మంచిదో, వాళ్లు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా అది వారికి మంచి ఆహారంగానే ఉంటుంది.