నాకు అంగవైకల్యం ఉన్నప్పటికీ నన్ను నేను విలువైన వ్యక్తిగా భావించడానికి ఏం చేయాలి
ఒక మహిళ తన కుటుంబం, పాఠశాల మరియు సమాజం మద్దతుతో ఎదిగి, తనకు సాధ్యమైనంత ఉత్తమ జీవితం గడిపినట్లయితే, ఆమెకు అంగవైకల్యం ఉన్నప్పటికీ, లేనప్పటికీ, ఆమెలో ఆత్మగౌరవ భావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే, వైకల్యం ఉన్న కారణంగా, ఒక స్త్రీ తనను తాను ఇతరుల కంటే తక్కువ విలువైన వ్యక్తిగా భావిస్తూ పెరిగితే, ఆతర్వాత, ఆమె తనను తాను విలువైన వ్యక్తిగా భావించడం అలవాటు చేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఆ ప్రక్రియ ఎన్నటికీ సులభం కాకపోయినప్పటికీ, ఆ దిశగా మెలల్లగా అడుగులు వేయడం ద్వారా ఆ విధంగా చేయవచ్చు.
ఇతర వ్యక్తులను కలవడమే మొదటి అడుగు. ఇతర మహిళలకు మీ గురించి తెలిసినప్పుడు, వైకల్యం ఉన్న మరియు వైకల్యం లేని మహిళల మధ్య నిజానికి ఎలాంటి తేడా లేదని వాళ్లు గ్రహిస్తారు. తద్వారా, మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారీ ఇతరులను కలుసుకోవడం మరియు వారితో మాట్లాడడం సులభమవుతుంది.
మహిళల కోసం ఒక సమూహం ప్రారంభించడం లేదా అందులో చేరడమే రెండవ దశ. ఇతరులతో మాట్లాడడం వల్ల మీరు మీ బలాలు మరియు బలహీనతల గురించి తెలుసుకోవడం ప్రారంభించడంలో మీకు సహాయపడుతుంది. సమూహం అనేది మహిళలు స్వేచ్ఛగా మాట్లాడటానికి సురక్షితమైన స్థలం అందించగలదు. అయితే, సమూహం లోపల వినే ఏ విషయం గురించి సమూహం వెలుపల మాట్లాడకూడదని మీరందరూ అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుంది.
వికలాంగ మహిళల కోసం ఉన్న ఏదైనా సమూహంలో మీరు చేరవచ్చు లేదా మీరే అలాంటి సమూహం ఒకటి ప్రారంభించవచ్చు మరియు వైకల్యం వల్ల వచ్చే ప్రత్యేక సవాళ్ల గురించి మీ ఆలోచనలు మరియు అనుభవాలను సమూహంలో పంచుకోవచ్చు. సంతోషకరమైన మరియు కష్టమైన సమయాల్లో మీరందరూ పరస్పరం మద్దతు అందించుకోవచ్చు.
స్వతంత్రంగా వ్యవహరించడం నేర్చుకోవడంలో కూడా మీరు ఒకరికొకరు మద్దతు అందించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వికలాంగ మహిళలు వైద్యులు, నర్సులు, దుకాణదారులు, రచయితలు, ఉపాధ్యాయులు, రైతులు మరియు సమాజ నిర్వాహకులుగా పనిచేస్తున్నారు. మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా, ఇతర సాధారణ స్త్రీ లాగే భవిష్యత్తు కోసం సిద్ధం కావడాన్ని మీరూ ప్రారంభించవచ్చు.
గుర్తుంచుకోండి: మీరు ఏం చేయలేరనే దానిమీద కాకుండా మీరు ఏం చేయగలరో దాని మీద దృష్టి పెట్టండి.