నాకు ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు నేను ఇతరులతో మాట్లాడాల్సిన అవసరమేమిటి
ఆత్మహత్య గురించి ఆలోచించే వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు, తరచుగా ఒంటరిగా, వేరుచేయబడినట్టుగా, నిరాశతో మరియు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు భావిస్తుంటారు. ఎవరితోనూ మాట్లాడటానికి వాళ్లు ఇష్టపడరు, బహుశా ఎవరూ తమకు సహాయం చేయలేరని వాళ్లు భావిస్తారు. తమ భావనల గురించి ఎవరితోనైనా మాట్లాడటానికి వాళ్లు అత్యంత ఇబ్బంది పడుతారు లేదా బిడియ పడుతారు.
అయితే, ఎవరితోనైనా మాట్లాడటం మరియు మీ భావనల గురించి (మీ స్నేహితులు, కుటుంబం, పొరుగువారు లేదా సహోద్యోగులతో) చర్చించడమనేది మీకు చాలా సహాయపడుతుంది. లేదంటే, మీరు మాట్లాడడం కోసం మీరు విశ్వసించే వ్యక్తి కోసం వెతకవచ్చు లేదా మీ సమాజంలోని ఆరోగ్య కార్యకర్త లేదా మత నాయకుడు అందుబాటులో ఉంటే మీరు వారి సహాయం కోరవచ్చు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర మహిళలు కూడా మీ భావనలు వినడానికి మరియు వారి ఆలోచనలు మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మీరు గుర్తించవచ్చు.
కొంతమంది మహిళలు వారికి పరిచయం లేని వాళ్లతో తమ గురించి లేదా తమ సమస్యల గురించి మాట్లాడటం సులభంగా భావిస్తారు (అలా చేయడం వారికి తక్కువ ఇబ్బందిగా అనిపిస్తుంది మరియు వారి నుండి మరింత తటస్థమైన మరియు నిష్పాక్షికమైన సలహా లభిస్తుందని కూడా భావిస్తారు). అనేక దేశాలు మరియు ప్రాంతాల్లో, ఆత్మహత్యల నివారణ హాట్‌లైన్ అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరితోనైనా అనామకంగా మరియు రహస్యంగా మాట్లాడాలనుకుంటే, మీరు వారిని ఇంటర్నెట్ ద్వారా సంప్రదించవచ్చు లేదా చాట్ చేయవచ్చు. మీరు వారి సేవల కోసం ఫీజు చెల్లించే అవసరం ఉండదు. అలాగే, మీరు మీ పేరు కూడా వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హాట్‌లైన్లు రాజకీయేతరమైనవి మరియు వర్గవ్యతిరేకమైనవిగా ఉంటాయి. వాటిలో పనిచేసే వ్యక్తులు వాళ్ల సొంత నమ్మకాలను మరియు విశ్వాసాలను మీపై రుద్దడానికి ప్రయత్నించరు. మీ మాటలు వినడానికి మాత్రమే వాళ్ల అక్కడ ఉంటారు.
మీరు మీ దేశంలోని సహాయ హాట్‌లైన్ నంబర్ కోసం http://www.befrienders.org/లో చూడవచ్చు.
ఎవరితోనైనా మాట్లాడడమనేది మీ సమస్యలకు మూల కారణాలు గుర్తించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా, సాధ్యమయ్యే పరిష్కారాలు కనుగొనడానికి కూడా మీకు సహాయపడుతుంది.
మీ పట్ల శ్రద్ధ వహించే వారితో చాట్ చేయడం వల్ల మీరు పూర్తి స్థాయిలో మార్పు చూడవచ్చు. మీకు ఇష్టమైన ఫ్రెండ్ లేదా కుటుంబ సభ్యులు వద్దకు వెళ్లడం కూడా మీలో పెద్ద మార్పు కలిగిస్తుంది. మీకు అలా ఎందుకు అనిపిస్తోందనే దాని గురించి మరియు మీలో అంతటి ఒత్తిడికి కారణాలు గురించి మాట్లాడుతూ, మీ అంతర్గత సమతుల్యతను తిరిగి పొందడానికి మీరు ఇవన్నీ చేయవచ్చు.