నాకు చేసే గర్భస్రావం సురక్షితమైనదని నేనెలా చెప్పగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మీకు చేసే గర్భస్రావం సురక్షితమైనదిగా ఉంటుందో, లేదో చెప్పడం ఎల్లప్పుడూ సులభం కాదు. గర్భస్రావం నిర్వహించబోయే ప్రదేశానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదా అక్కడున్న వారిని ఈ ప్రశ్నలు అడగండి:

  • ఇక్కడ గర్భస్రావం చేయడం వల్ల మహిళలు అనారోగ్యానికి గురికావడం లేదా చనిపోవడం జరిగినట్టు మీరు విన్నారా? అవును అనే సమాధానం వస్తే, వేరొక చోటుకి వెళ్లండి.
  • గర్భస్రావం ఎవరు చేస్తారు, వారు ఎలాంటి శిక్షణ తీసుకుని ఉన్నారు? వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు సాంప్రదాయ మంత్రసానులు లాంటివారందరూ గర్భస్రావాలు చేయవచ్చు. అయితే, సురక్షిత గర్భస్రావ పద్ధతులు మరియు ఇన్ఫెక్షన్ నిరోధించే పద్ధతులు గురించి తెలియని వారు గర్భస్రావం చేయడం చాలా ప్రమాదకరం కాగలదు.
  • గర్భస్రావం చేసే గది శుభ్రంగా మరియు చక్కగా ఉందా? అక్కడంతా గజిబిజిగా మరియు మురికిగా ఉంటే, గర్భస్రావం కూడా అలాగే ఉండవచ్చు.
  • చేతులు కడుక్కోవడానికి స్థలం ఉందా? చేతులు కడుక్కోవడానికి చోటు లేనప్పుడు మీ ఆరోగ్య కార్యకర్త శుభ్రమైన, సురక్షితమైన గర్భస్రావం చేయలేరు.
  • అక్కడున్న పరికరాలు ఇంట్లో చూసేవిగా లేదా వాళ్లే తయారు చేసినట్టుగా ఉన్నాయా? అలాంటి పరికరాలతో గర్భస్రావం చేస్తే, గాయాలు మరియు ఇన్ఫెక్షన్‌కి దారితీయవచ్చు.
  • పరికరాలు ఏవిధంగా శుభ్రం చేస్తున్నారు మరియు సూక్ష్మక్రిమి రహితం చేస్తున్నారు? ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మక్రిములను చంపడానికి పరికరాలను గాఢమైన క్రిమిసంహారక ఔషధంలో నానబెట్టాలి లేదా నీటిలో ఉడకబెట్టాలి.
  • ఖర్చు సముచితంగా అనిపిస్తోందా? ఖర్చు చాలా ఎక్కువగా ఉండడం అనేది కొన్నిసార్లు ఆ ఆరోగ్య కార్యకర్త డబ్బు గురించే తప్ప మీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని సూచిస్తుంది.
  • గర్భస్రావాలతో పాటు అక్కడ ఇతర ఆరోగ్య సేవలు కూడా అందిస్తున్నారా? ఒక మంచి ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ, STIలకు చికిత్స, HIV నిరోధం లాంటి మహిళలకు అవసరమైన ఇతర సేవలు కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తుండాలి.
  • గర్భస్రావం చేసే సమయంలో లేదా ఆ తర్వాత, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? అత్యవసర పరిస్థితిలో మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఒక ప్రణాళిక సిద్ధంగా ఉండాలి.

గుర్తుంచుకోండి: క్రింది సందర్భాల్లో గర్భస్రావం అనేది ప్రమాదకరం కాగలదు:

  • మీ చివరి నెలసరి రక్తస్రావం జరిగి అప్పటికే 3 నెలలు దాటిపోయి ఉంటే.
  • మీరు గర్భవతిగా ఉన్నట్టు ఇతరులు గుర్తించే పరిస్థితి మొదలవుతుంటే.

మీ గర్భం వయసు ఎంత ఎక్కువైతే, గర్భస్రావం తర్వాత మీకు ఎదురయ్యే సమస్యలు కూడా అంత ఎక్కువగా ఉంటాయి. మీ భద్రత కోసం, గర్భం దాల్చిన 3 నెలల కంటే ఎక్కువ కాలం తర్వాత చేసే గర్భస్రావం ప్రక్రియను క్లినిక్ లేదా ఆసుపత్రిలో ప్రత్యేక పరికరాలతో నిర్వహించాలి.

Sources
  • Audiopedia ID: tel020208