నాకు పరిచయం ఉన్నవారే నా మీద అత్యాచారం చేసే అవకాశం ఉందా
అత్యాచారానికి గురైన చాలామంది మహిళల విషయంలో ఆ వ్యక్తి ఆ మహిళకు పరిచయం ఉన్నవాళ్లుగానే ఉంటారు. అతనితో బంధం కొనసాగించక తప్పదనే పరిస్థితిలో స్త్రీ ఉంటే, దాని నుండి కోలుకోవడం మరియు దాని గురించి ఇతరులకు చెప్పడం ఆమెకు చాలా కష్టతరంగా మారుతుంది.
భర్త లేదా మాజీ భర్త ద్వారా అత్యాచారం చట్టం లేదా సాంప్రదాయ ఆచారంలో ఒక స్త్రీని ఆమె భర్త ఆస్తిగా పరిగణిస్తే, స్త్రీకి ఇష్టం ఉనా, లేకపోయినా, భర్తకు అవసరమైనప్పుడల్లా, ఆమెతో సెక్స్ చేయడాన్ని అతను తన హక్కుగా భావించవచ్చు.
ఒక మహిళ మీద ఆమె ప్రియుడే అత్యాచారం చేయవచ్చు ఆమె కోసం డబ్బు ఖర్చు చేసిన కారణంగా, ఆమె మీద తనకు హక్కు ఉందని ఆమె ప్రియుడు చెప్పవచ్చు. తాము గతంలో కూడా సెక్స్ చేశామని, ఆమె అతడిని లైంగికంగా రెచ్చగొట్టిందని లేదా ఆమెను వివాహం చేసుకోవడానికి అతను ముందుకొచ్చాడని చాలా సాకులు చెప్పవచ్చు. కానీ, ఆమెను బలవంత పెట్టడం ద్వారా, అతను సెక్స్ చేస్తే, అది అత్యాచారమే అవుతుంది. ఆ రకమైన అత్యాచారం గురించి మాట్లాడటం ఒక మహిళకు కష్టంగా ఉండవచ్చు. ఇతరులు తననే నిందిస్తారని ఆమె భయపడడమే అందుకు కారణం.
లైంగిక వేధింపు ఒక మహిళ తన ఉద్యోగం కొనసాగించడం కోసం సహోద్యోగి లేదా సూపర్‌వైజర్ లేదా బాస్ ఆమెతో బలవంతంగా సెక్స్ చేయవచ్చు. ఎవరికైనా చెబితే ఉద్యోగం నుండి తీసేస్తామని లేదా ఇతర శిక్షలు విధిస్తామని బెదిరించవచ్చు.
పిల్లల మీద లైంగిక వేధింపులు ఒక అమ్మాయి లేదా అబ్బాయి మీద కుటుంబంలోని ఎవరైనా పురుషుడు లేదా వయోజన వ్యక్తి అత్యాచారానికి పాల్పడవచ్చు. తండ్రి, సవతి తండ్రి, మామ, సోదరుడు, బంధువు లేదా ఇతర కుటుంబ సభ్యుడు ఒక చిన్నారితో సెక్స్ చేస్తే లేదా ఆమెను లేదా అతడిని లైంగికేచ్ఛతో తాకితే, అది అత్యాచారం క్రిందకే వస్తుంది. అలాంటి పరిస్థితిలో పిల్లలు గందరగోళానికి గురవుతారని, ఏం జరుగుతుందో వారికి అర్థం కాకపోవచ్చని గ్రహించడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా, దుర్వినియోగం చేస్తున్న వ్యక్తిని పిల్లలు విశ్వసిస్తుంటే, వాళ్లని గుర్తించడం మరింత కష్టం. కుటుంబంలోని ఇతర సభ్యులకు ఆ దుర్వినియోగం గురించి తెలియకపోవచ్చు. అలాంటిది జరుగుతోందంటే వాళ్లు నమ్మకపోవచ్చు లేదా అదంతా పిల్లల తప్పే అని చెప్పవచ్చు. అత్యాచారానికి గురైన వ్యక్తిని నిందించడం ఎప్పుడూ సరైనది కాదు. ముఖ్యంగా పిల్లల విషయంలో అస్సలు సరైనది కాదు.