మీకు STI సంకేతాలు ఉంటే లేదా మీకు STI సోకే ప్రమాదం ఉందని మీరు భావిస్తుంటే, మీరు వెంటనే చికిత్స ప్రారంభించాలి. దురదృష్టవశాత్తూ, STIల కోసం చాలాచోట్ల పరీక్షలు అందుబాటులో లేవు, ఉన్నప్పటికీ, అవి ఖరీదైనవి కావచ్చు మరియు ఎల్లప్పుడూ ఖచ్చితమైన ఫలితాలు అందించకపోవచ్చు. STIల కోసం తక్కువ ఖర్చుతో, ఖచ్చితమైన పరీక్షలు లేకపోవడమనేది మహిళలకు ప్రధాన సమస్యగా ఉంటోంది. ఈ కారణంగా, మహిళలు వారికి అవసరం లేని, వాళ్లు భరించలేని మందులు తీసుకోవడానికి దారితీయవచ్చు మరియు దుష్ప్రభావాలు ఎదుర్కోవచ్చు.
ఇన్ఫెక్షన్‌కి తక్షణం చికిత్స చేయండి.
మీ అనారోగ్యం బాగా ముదిరే వరకు వేచి ఉండకండి. చికిత్స తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మరింత తీవ్రమైన సమస్యల రాకుండా మీకు రక్షణ లభిస్తుంది మరియు ఇతరులకు STIలు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.
పరీక్ష అందుబాటులో ఉంటే పరీక్ష చేయించుకోండి. మీకు వేరొక STI సోకవచ్చు మరియు ఎలాంటి సంకేతాలు లేకపోవచ్చు.
మీ భాగస్వామికి కూడా చికిత్స తీసుకోవడానికి సహాయపడండి. అతను చికిత్స తీసుకోకపోతే, మీరు మళ్లీ అతనితో లైంగిక చర్య జరిపినప్పుడు అతని వల్ల మీకు మళ్లీ STI సోకుతుంది.
సురక్షిత లైంగిక సంబంధాలు పాటించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోకపోతే, మీకు వేరొక STI లేదా HIV సోకవచ్చు.
HIV పరీక్ష చేయించుకోవడానికి ప్రయత్నించండి. STIలు మరియు HIV ఇన్ఫెక్షన్లు తరచుగా కలిసి సోకుతుంటాయి.
సిఫార్సు చేసిన అన్ని మందులు కొనుగోలు చేయండి మరియు తీసుకోండి. మీ సంకేతాలు మాయమైనప్పటికీ, అన్ని మందులు పూర్తి స్థాయిలో పనిచేసే వరకు మీకు పూర్తిగా నయం కాదు. మందులు తీసుకున్న తర్వాత కూడా సంకేతాలు తగ్గకపోతే, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. నొప్పి లేదా యోని నుండి స్రావాలు రావడానికి క్యాన్సర్ లాంటి వేరొక సమస్య కూడా ఉండే అవకాశం ఉంది.