నా బిడ్డకు ఏ రోగనిరోధక టీకాలు అవసరం
కొన్ని రకాల క్షయ మరియు కుష్టు వ్యాధి నుండి పాక్షిక రక్షణ అందించే బిసిజి (బాసిల్ కాల్మెట్-గుయెరిన్) టీకాతో పిల్లలందరికీ రోగనిరోధకత అవసరం.
పిల్లలందరికీ డిటిపి టీకాతో (డిపిటి వ్యాక్సిన్ అని కూడా పిలుస్తారు) డిఫ్తీరియా, టెటానస్ మరియు పెర్టుసిస్ నుండి రోగనిరోధకత అవసరం. డిప్తీరియా ఎగువ శ్వాసకోశ మార్గంలో ఇన్ఫెక్షన్‌కి కారణమవుతుంది. ఇది తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మరియు మరణానికి దారితీయవచ్చు. ధనుర్వాతం అనేది కండరాలు బిగుసుకుపోవడం మరియు బాధాకరమైన కండరాల తిమ్మిరికి కారణమవుతుంది మరియు ప్రాణాంతకం కావచ్చు. పెర్టుసిస్ లేదా కోరింత దగ్గు అనేది శ్వాసకోశ మార్గాన్ని ప్రభావితం చేస్తుంది మరియు నాలుగు నుండి ఎనిమిది వారాల పాటు ఉండే దగ్గుకు కారణమవుతుంది. శిశువుల్లో ఈ వ్యాధి చాలా ప్రమాదకరంగా మారుతుంది.
గర్భిణీ స్త్రీలు మరియు శిశువులందరికీ ధనుర్వాతం నుండి రోగనిరోధకత అవసరం.
పిల్లలందరికీ తట్టు వ్యాధి నుండి రోగనిరోధకత అవసరం. ఇది పోషకాహార లోపం, పేలవమైన మానసిక అభివృద్ధి మరియు వినికిడి మరియు దృష్టి లోపాలకు ప్రధాన కారణం కాగలదు. దగ్గు, ముక్కు కారడం లేదా కళ్ళు ఎర్రబడటం లాంటి వాటితో పాటు జ్వరం మరియు దద్దుర్లు లాంటివి పిల్లల్లో తట్టు వ్యాధి సంకేతాలుగా ఉంటాయి. తట్టు వ్యాధితో పిల్లలు చనిపోయే అవకాశం ఉంది.
పిల్లలందరికీ పోలియో నుండి రోగనిరోధక శక్తి అందించాలి. నడుము క్రింది భాగం చచ్చుబడిపోవడమనేది పోలియో సంకేతంగా ఉంటుంది. వ్యాధి సోకిన ప్రతి 200 మంది పిల్లల్లో ఒకరు శాశ్వత వికలాంగులవుతారు.
ఇతర రోగనిరోధకతలనేవి మీరు నివసిస్తున్న దేశం మరియు ప్రాంతం మీద ఆధారపడి ఉంటాయి. జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా షెడ్యూల్ అనుసరించడం చాలా ముఖ్యం. పిల్లలకు సిఫార్సు చేసిన వయస్సులో రోగనిరోధకత ఇవ్వాలి మరియు సిఫార్సు చేసిన వ్యవధిలో తదుపరి మోతాదులు అందించాలి.