నేను ఏవిధంగా విశ్రాంతి తీసుకోవచ్చు
విశ్రాంతి
వంట చేయడం, నీళ్లు తీసుకురావడం మరియు కుటుంబాల మనుగడ కోసం ఇంధనం సేకరించే పనుల్లో చాలామంది మహిళలు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో, ఆ మహిళ ఇంటి బయట కూడా పని చేయాల్సి వస్తే, ఆమె మీద భారం రెట్టింపు అవుతుంది. ఆమె రోజంతా ఫ్యాక్టరీలో, ఆఫీసులో లేదా పొలంలో పని చేసి, అటుమీదట తన కుటుంబం బాగోగులు చూడడం కోసం ఇంట్లో రెండవ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఇలా రోజంతా శ్రమపడడం వల్ల ఆమెలో అలసట, పోషకాహార లోపం మరియు అనారోగ్యానికి దారితీస్తుంది. ఎందుకంటే, విశ్రాంతి తీసుకోవడానికి గానీ, తన శరీరానికి శక్తి కోసం తగినంత ఆహారం తీసుకోవడానికి గానీ ఆమెకి తగినంత సమయం ఉండదు.
ఒక మహిళ మీద పనిభారం తగ్గించడంలో సహాయపడడం కోసం, ఇంట్లో పని భారాన్ని కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం మరియు వంట చెరకు మరియు నీళ్లు మోసుకురావడం లాంటి పనుల్లో ఇతర మహిళలు (కలిసి లేదా ఒకరి తర్వాత ఒకరుగా) సహాయం చేయడం కూడా, ఒక మహిళ మీద పని భారం తగ్గించడంలో సహాయపడగలదు. ఒక మహిళ జీతం కోసం పనిచేసినప్పటికీ, చేయకపోయినప్పటికీ, పిల్లల సంరక్షణ పనిలోనైనా ఆమెకి సహాయం అవసరం కావచ్చు. పిల్లల సంరక్షణ సహకార సంఘాలను కొంతమంది మహిళలు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి వచ్చే చిన్న పిల్లల బాగోగులను ఒక మహిళ చూసుకోవడం వల్ల, మిగిలిన మహిళలు పనికి వెళ్లవచ్చు. సంఘంలోని పిల్లల బాగోగులు చూసుకునే మహిళకు మిగిలిన వాళ్లు కొంత మొత్తం చెల్లిస్తారు లేదా విడదల వారీగా ప్రతి మహిళ ఆ పని చేయడం చేస్తారు.
ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమెకు మరింత విశ్రాంతి అవసరం. తనకు విశ్రాంతి ఎందుకు అవసరమో ఆమె తన కుటుంబానికి వివరించి, తన పనిభారం పంచుకోవడంలో సహాయం కోసం వారిని అడగవచ్చు.
వ్యాయామం చాలామంది మహిళలు వారి రోజువారీ పనుల రూపంలో పెద్ద మొత్తంలో వ్యాయామం చేస్తుంటారు. అయితే, ఒక మహిళ పని సమయంలో పెద్దగా కదలకపోతే-ఉదాహరణకు, ఫ్యాక్టరీ లేదా ఆఫీసులో ఆమె రోజంతా కూర్చుని లేదా నిలబడి ఉంటే-ఆమె ప్రతిరోజూ నడవడానికి మరియు వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. ఆమె గుండె, ఊపిరితిత్తులు మరియు ఎముకలు బలంగా ఉంచడంలో ఇది ఆమెకు సహాయపడుతుంది. పని సమయంలో మీరు అనేక గంటల పాటు కూర్చుని లేదా నిలబడి ఉండాల్సి వస్తే, మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కొన్నిసార్లు ఆ సమస్యలు నెలలు లేదా సంవత్సరాల తర్వాతే బయటపడుతాయి. నిజానికి, వీటిలో చాలా సమస్యలను నిరోధించవచ్చు.