నేను నా నెలసరి రుతు చక్రం గురించి ఏం తెలుసుకోవాలి
ఒక మహిళ పునరుత్పత్తి సంవత్సరాల్లో, ప్రతి నెలా ఒకసారి కొన్ని రోజుల పాటు ఆమె గర్భాశయం నుండి రక్తంతో కలిసిన ద్రవం వెలువడి, అది ఆమె యోని గుండా బయటకు వెళ్తుంది. దీనిని 'నెలసరి రక్తస్రావం', 'నెలసరి' లేదా 'రుతుస్రావం' అని పిలుస్తారు. ఇదొక ఆరోగ్యకరమైన ప్రక్రియ మరియు గర్భం దాల్చడానికి శరీరం సిద్ధమయ్యే విధానంలో ఇదొక భాగంగా ఉంటుంది.
నెలసరి రక్తస్రావం అనేది తమ జీవితంలో ఒక సాధారణ భాగమేనని చాలా మంది మహిళలు భావించినప్పటికీ, అలా ఎందుకు జరుగుతుంది లేదా కొన్నిసార్లు ఆ ప్రక్రియలో ఎందుకు మార్పు వస్తుందో చాలామందికి తెలియదు.
నెలసరి చక్రం అనేది ప్రతి మహిళలో భిన్నంగా ఉంటుంది. మహిళలో నెలసరి రక్తస్రావం కనిపించిన మొదటి రోజున ఈ చక్రం మొదలవుతుంది. చాలామంది మహిళల్లో ప్రతి 28 రోజులకు ఒకసారి రక్తస్రావం కనిపిస్తుంది. అయితే, కొందరిలో ప్రతి 20 రోజులకు ఒకసారి లేదా కొద్దిమందిలో ప్రతి 45 రోజులకు ఒకసారి రక్తస్రావం జరుగుతుంది. మహిళకు వయస్సు పెరిగే కొద్దీ, ప్రసవం తర్వాత లేదా ఒత్తిడి కారణంగా, నెలవారీ రక్తస్రావాల మధ్య విరామంలో మార్పు ఉండవచ్చు.
అండాశయాల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల మొత్తం అనేది నెలవారీ చక్రం వ్యాప్తంగా మారుతూ ఉంటుంది. ఈ చక్రం మొదటి అర్ధ భాగంలో, అండాశయాల్లో ఎక్కువ ఈస్ట్రోజెన్ తయారవుతుంది కాబట్టి, గర్భాశయంలో రక్తం మరియు కణజాలంతో కూడిన మందమైన పొర పెరుగుతుంది. ఆ మహిళ ఆ నెలలో గర్భం దాల్చితే, శిశువు పెరగడానికి అవసరమయ్యే ఒక మృదువైన గూడు అందించడం కోసం శరీరం ఆ పొరను ఏర్పరుస్తుంది.
రుతుచక్రం ముగియడానికి సుమారుగా 14 రోజుల ముందు, అలాంటి మృదువైన పొర సిద్ధంగా ఉన్నప్పుడు, అండాశయాల్లో ఒకదాని నుండి అండం విడుదలవుతుంది. దీన్నే అండోత్సర్గము అంటారు. ఆ అండం ఒక నాళం ద్వారా, గర్భాశయంలోకి ప్రయాణిస్తుంది. ఈ సమయంలో, ఆ మహిళ ఫలవంతమైతే, ఆమె గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఆ మహళ ఇటీవల లైంగిక చర్యలో పాల్గొని ఉంటే, పురుషుడి వీర్యం ఆమె అండంలోకి ప్రయాణిస్తుంది. దీనినే ఫలదీకరణం అంటారు. గర్భానికి సంబంధించి ఇదే ప్రారంభంగా ఉంటుంది
రుతుచక్రం సంబంధిత చివరి 14 రోజుల్లో-అంటే, ఆమెలో తదుపరి నెలసరి ప్రారంభమయ్యే వరకు-ఆమెలో ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ప్రొజెస్టెరాన్ అనేది గర్భాశయంలో లైనింగ్ ఏర్పరచడం ద్వారా, గర్భధారణకు సిద్ధం చేస్తుంది. చాలా నెలల్లో, అండం ఫలదీకరణం చెందదు కాబట్టి, గర్భాశయం లోపల లైనింగ్ అవసరం ఉండదు. ఆ పరిస్థితిలో, అండాశయాల నుండి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది మరియు ఆ లైనింగ్ విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. నెలసరి రక్తస్రావం సమయంలో, గర్భాశయం లోపలి పొర శరీరం బయటకు వచ్చినప్పుడు, అండం కూడా బయటకు వచ్చేస్తుంది. కొత్త నెలసరి చక్రానికి ఇది ప్రారంభంగా ఉంటుంది. నెలసరి రక్తస్రావం తర్వాత, అండాశయాలు మళ్లీ ఎక్కువ మొత్తంలో ఈస్ట్రోజెన్ తయారు చేయడం ప్రారంభించడం వల్ల, మళ్లీ మరో లైనింగ్ పెరగడం మొదలవుతుంది.