నేను వెళ్లిపోవడానికి సిద్ధమైనప్పుడు నా భద్రత కోసం నేనేం చేయగలను
మీకు వీలైనంత మొత్తంలో డబ్బు దాచుకోండి. డబ్బును సురక్షిత ప్రదేశంలో (ఇంటికి దూరంగా) ఉంచండి లేదా మీరు మరింత స్వతంత్రంగా మారడానికి మీ స్వంత పేరుతో బ్యాంకు ఖాతా తెరవండి. మీరు ఆ పని సురక్షితంగా చేయగలిగితే, అతని మీద ఆధారపడడం తగ్గించడం కోసం మీరు చేయగలిగిన ఇతర విషయాల గురించి ఆలోచించండి. అంటే ,స్నేహితులను సంపాదించుకోవడం, సమూహంలో చేరడం లేదా మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం లాంటివి చేయండి.
అదనపు డబ్బు సంపాదించడం కోసం ఉపయోగించగల నైపుణ్యాలు మీకు ఉన్నాయా?
దుర్వినియోగానికి గురైన మహిళల కోసం 'సురక్షిత గృహాలు' లేదా ఇతర సేవలు ఏవైనా ఉన్నాయా అని వెతకండి. వేధింపులకు గురైన మహిళలు, వారి పిల్లలు కొంతకాలం ఆశ్రయం పొందడం కోసం కొన్ని పట్టణాలు, నగరాల్లో ఇలాంటి ప్రత్యేక ప్రదేశాలు ఉంటాయి. మీరు వెళ్ల గలిగిన అలాంటి ప్రదేశం ఏదైనా ఉందా అని తెలుసుకునేందుకు ప్రయత్నించండి.
మీరు విశ్వసించే స్నేహితులు లేదా బంధువులు మిమ్మల్ని వారి ఇంట్లో ఉంచుకునేందుకు అనుమతిస్తారా లేదంటే మీకు డబ్బు అప్పు ఇస్తారా అని అడగండి. మీరు వాళ్లని ఆవిధంగా అడిగిన విషయం మీ భాగస్వామితో చెప్పరని నిర్ధారించుకోండి.
మీ గుర్తింపు లేదా మీ పిల్లల టీకా రికార్డులు లాంటి ముఖ్యమైన పత్రాల కాపీలు సేకరించండి. ఒక కాపీ ఇంట్లో ఉంచండి మరియు మీరు విశ్వసించే వారికి మరొక కాపీ ఇవ్వండి. డబ్బు, మీ పత్రాల కాపీలు మరియు అదనపు దుస్తులను మీరు విశ్వసించే వారి వద్ద ఉంచండి. తద్వారా, మీరు త్వరగా బయటపడవచ్చు.
మీరు ఆ పనులన్నీ సురక్షితంగా చేయగలిగితే, మీ ప్లాన్ చక్కగా పనిచేస్తోందా అని నిర్ధారించుకోవడం కోసం మీ పిల్లలతో కలసి మీ ప్లాన్ అమలుచేసి చూడండి. మీ పిల్లలు ఆ విషయం ఎవరికీ చెప్పకుండా చూసుకోండి.