న్యుమోనియాను నేనెలా నిరోధించగలను
బిడ్డ పుట్టిన తర్వాత, మొదటి ఆరు నెలలు ఆ శిశువుకి తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వడం మరియు శిశువులందరికీ చక్కటి పోషణ అందించడం, వారు పూర్తి స్థాయిలో రోగనిరోధక శక్తితో ఉన్నారని నిర్ధారించడం ద్వారా, న్యుమోనియాను కుటుంబాలు నిరోధించవచ్చు.
శిశువులను న్యుమోనియా మరియు ఇతర అనారోగ్యాల నుండి రక్షించడంలో తల్లిపాలు సహాయపడుతుంది. శిశువు జీవితంలో మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం చాలా ముఖ్యం. ఆరు నెలల వయస్సు తరువాత, శిశువులకి వివిధ రకాల ఆరోగ్యకర ఆహారాలు తినిపించాలి మరియు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలి. శిశువు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు అందుకునేలా మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మరియు ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పండ్లు మరియు కూరగాయలు (ఆకుపచ్చటి ఆకు కూరలతో సహా), కాలేయం, రెడ్ పామ్ ఆయిల్, పాల ఉత్పత్తులు, చేపలు మరియు గుడ్లు లాంటివి ఆరోగ్యకరమైన ఆహారాలకు కొన్ని ఉదాహరణలు.
సురక్షితమైన నీరు మరియు మంచి పరిశుభ్రతా పద్ధతులనేవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మరియు అతిసారం లాంటి ఇతర అనారోగ్యాల సంఖ్య తగ్గించడంలో సహాయపడతాయి. కూరగాయలు మరియు పండ్లు కడిగి తినడం, ఆహార తయారీ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం, సబ్బు మరియు నీటితో లేదా బూడిద మరియు నీళ్లు లాంటి ప్రత్యామ్నాయాలతో చేతులు కడుక్కోవడం లాంటివి పరిశుభ్రతా అలవాట్లు క్రిందకు వస్తాయి.
ప్రతి చిన్నారికి సిఫార్సు చేసిన వ్యాధి నిరోధక టీకాల శ్రేణి తప్పక వేయించాలి. శిశువులకి ప్రారంభ రక్షణ చాలా కీలకం. మొదటి సంవత్సరంలో మరియు రెండవ సంవత్సరంలో పిల్లలకు రోగనిరోధకత అత్యంత కీలకం. అప్పుడే శిశువుకి తట్టు, పెర్టుసిస్ (కోరింత దగ్గు), క్షయ మరియు న్యుమోనియాకి దారితీసే ఇతర శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. బాలికలు మరియు బాలురు ఇద్దరికీ సమానంగా వైవిధ్యమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం మరియు అన్ని రోగనిరోధక టీకాలు అందేలా తల్లిదండ్రులు మరియు ఇతర సంరక్షకులు చూసుకోవాలి. ఆహారం, పరిశుభ్రత మరియు రోగనిరోధక టీకాలు, న్యుమోనియా మరియు ఇతర అనారోగ్యాల నుండి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులు మరియు ఇతర సంరక్షకులకు ఆరోగ్య కార్యకర్తలు సమాచారం అందించగలరు.
పిల్లలు పొగతో కూడిన వాతావరణంలో నివసిస్తుంటే న్యుమోనియా మరియు ఇతర శ్వాస సంబంధిత అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగకు గురికావడం వల్ల పుట్టుకకు ముందే బిడ్డకు హాని కలిగించవచ్చు. గర్భిణీ స్త్రీలు పొగ త్రాగకూడదు లేదా పొగకు గురికాకూడదు. ముఖ్యంగా, పిల్లలను పొగతో ఉండే వంటశాలలకు దూరంగా మరియు వంట ప్రదేశంలోని మంటలకు దూరంగా ఉంచాలి. కౌమారదశలోని పిల్లలు ధూమపానానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించాలి మరియు దానివల్ల ప్రమాదాల గురించి వారిని, వారి స్నేహితులను అప్రమత్తం చేయాలి.
పొగతాగే వారి వల్ల వచ్చే పొగ చిన్న పిల్లలకు హానికరం. సిగరెట్లు, గొట్టాలు లేదా సిగార్ల నుండి బయటికొచ్చే పొగ గంటల తరబడి గాలిలోనే ఉంటుంది. ఆ పొగను పీల్చితే ధూమపానం చేయని వాళ్లకి కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం మరియు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.