మంచి పోషకాహారం అంటే ఏమిటి
మంచి పోషకాహారం అంటే శరీరం ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి మరియు వ్యాధితో పోరాడటానికి అవసరమైన ఆహారం మరియు సరైన ఆహారం అని అర్థం.
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో, చాలా మంది ప్రజలు దాదాపు ప్రతి భోజనంలోనూ ప్రధానంగా తక్కువ ఖర్చుతో లభించే ఒక ఆహారం తింటారు. ప్రాంతాన్ని బట్టి, ఇది బియ్యం, మొక్కజొన్న, చిరుధాన్యాలు, గోధుమలు, కసావా, బంగాళాదుంప, బ్రెడ్ ఫ్రూట్ లేదా అరటి లాంటివి కావచ్చు. ఈ ప్రధాన ఆహారం అనేది సాధారణంగా శరీరపు రోజువారీ ఆహార అవసరాలను చాలా వరకు తీరుస్తుంది.
అయితే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి ఈ ప్రధాన ఆహారం మాత్రమే సరిపోదు. ప్రోటీన్ (శరీర నిర్మాణానికి సహాయపడే), విటమిన్లు మరియు ఖనిజాలు (శరీరాన్ని రక్షించడానికి మరియు మరమ్మతు చేయడానికి సహాయపడేవి) మరియు కొవ్వులు మరియు చక్కెర (శక్తిని ఇచ్చేవి) లాంటివి శరీరానికి అందాలంటే ఇతర 'సహాయక' ఆహారాలు అవసరం.
ఆరోగ్యకర ఆహారాల్లో ప్రోటీన్ కలిగిన ఆహారాలు మరియు విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలతో సహా వివిధ రకాల ఆహారాలు భాగంగా ఉంటాయి. మీకు కొవ్వు మరియు చక్కెర కొద్ది మొత్తంలోనే మాత్రమే అవసరమైనప్పటికీ, తగినంత ఆహారం పొందడంలో మీకు సమస్యలు ఉంటే, చాలా తక్కువ ఆహారం తినడం కంటే చక్కెర మరియు కొవ్వుతో కూడిన ఆహారం తినడం మంచిది.
ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక మహిళ ఇక్కడ జాబితా చేసిన అన్ని ఆహారాలు తినవలసిన అవసరం లేదు. ఆమె అలవాటుపడిన ప్రధాన ఆహారాలను తినవచ్చు మరియు ఆమె ప్రాంతంలో అందుబాటులో ఉండే సహాయక ఆహారాలు చేర్చుకోవచ్చు.