మద్యం మరియు మాదకద్రవ్యాలు అలవాటుకి కారణం ఏమైనప్పటికీ, చాలా సులభంగా అవి దుర్వినియోగం చేయబడతాయి. ఒక మహిళ మద్యం లేదా మాదకద్రవ్యాలు ఉపయోగిస్తున్నప్పుడు, తాను ఉపయోగించే మొత్తం మీద లేదా మద్యం లేదా మాదకద్రవ్యాలు తీసుకునే సమయంలో ఆమె ప్రవర్తనా తీరు మీద ఆమె నియంత్రణ కోల్పోతునట్లయితే, ఆమె మాదకద్రవ్యాలను లేదా మద్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అర్థం. అలాంటివాళ్లు ఈ పరిస్థితిలో ఉంటారు. అవి:
పగలు లేదా రాత్రి వాళ్ల సమయం హుషారుగా గడవాలంటే వాళ్లకి ఆ డ్రింక్ లేదా మాదకద్రవ్యం అవసరం అని భావిస్తారు. సమయం సందర్భం లేకుండా లేదా ఒంటరిగా ఉన్నప్పుడల్లా వాళ్లు వాటిని తీసుకుంటూ ఉంటారు.
వాళ్లు వాటిని ఏ మొత్తంలో ఉపయోగిస్తున్నారనే విషయమై అబద్ధం చెబుతారు లేదా వాటిని దాచిపెడుతారు.
మాదకద్రవ్యాలు లేదా మద్యం కొనడం కోసం వాళ్లు చేసే అధిక ఖర్చు కారణంగా వాళ్లు డబ్బు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మాదకద్రవ్యాలు లేదా మద్యం కొనడానికి డబ్బు కోసం కొందరు వ్యక్తులు నేరాలకు కూడా పాల్పడతారు.
మితం మించి మద్యం తాగడం లేదా మాదకద్రవ్యాలు ఉపయోగించడం ద్వారా, వాళ్లు వేడుకలను నాశనం చేస్తారు.
మాదకద్రవ్యాలు లేదా మద్యం తీసుకున్న సమయంలో వాళ్ల ప్రవర్తన సిగ్గుపడేలా ఉంటుంది.
మద్యం లేదా మాదకద్రవ్యాలు ఉపయోగించడం వల్ల వాళ్లు గతంలో లాగా పనిచేయలేరు లేదా తరచుగా పనికి వెళ్లలేరు.
హింసాత్మక ప్రవర్తనతో వాళ్లు సమస్యలు ఎదుర్కొంటారు. ఒక పురుషుడు అతని భార్య, పిల్లలు లేదా స్నేహితుల పట్ల మరింత హింసాత్మకంగా ప్రవర్తించవచ్చు.
ఏదైనా మాదకద్రవ్యం తీసుకోవడం వల్ల మీ జీవితంలో మార్పు వస్తుంటే, దాన్ని మీరు ఆపేయాల్సిన సమయం వచ్చిందని అర్థం. మాదకద్రవ్యాల వల్ల మీకు, మీ కుటుంబానికి లేదా మీ స్నేహితులకు హాని ఎదురవ్వడానికి ముందే మీరు దాన్ని ఆపేయడం మంచిది.