మధుమేహం అంటే ఏమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఆహారంలోని చక్కెరలను శరీరం సరిగ్గా ఉపయోగించుకోలేని సమస్యనే మధుమేహం అంటారు. అంధత్వం, అవయవాలు కోల్పోవడం, కోమా లేదా మరణానికి కూడా ఇది దారితీయవచ్చు. టైప్ 1 మధుమేహం సాధారణంగా బాల్యంలోనే మొదలవుతుంది. టైప్ 1 మధుమేహం ఉన్న వ్యక్తులు వారి జీవితాంతం ఇన్సులిన్ అనే ఔషధం తీసుకోవాలి. టైప్ 2 మధుమేహం సాధారణంగా ఒక వ్యక్తి 40 ఏళ్లు దాటినప్పుడు ప్రారంభమవుతుంది. అధిక బరువు ఉన్నవారిలో ఇది సర్వసాధారణం.

గర్భధారణ సమయంలో ఒక మహిళకు మధుమేహం కూడా రావచ్చు. దీన్నే గర్భధారణ సమయ మధుమేహం అంటారు. మీరు గర్భవతిగా ఉండి, మీకు ఎల్లప్పుడూ దాహం వేస్తుంటే లేదా మీరు బరువు తగ్గిపోతుంటే, మీ రక్తంలో చక్కెర స్థితి పరీక్షించడానికి ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి.

మధుమేహం సంకేతాలు ఎలా ఉంటాయి

ప్రారంభ సంకేతాలు:

  • ఎల్లప్పుడూ దాహం వేస్తుంటుంది
  • తరచుగా, ఎక్కువ మొత్తంలో మూత్ర విసర్జన
  • ఎల్లప్పుడూ అలసటగా ఉంటుంది
  • ఎల్లప్పుడూ ఆకలి వేస్తుంటుంది
  • బరువు తగ్గుతారు

ఆ తర్వాత, మరింత తీవ్రమైన సంకేతాలు:

  • చర్మం దురదపెట్టడం
  • అస్పష్టమైన కంటి చూపు
  • అరచేతులు లేదా పాదాల్లో కొంతమేర అనుభూతి కోల్పోవడం
  • తరచుగా యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు
  • పాదాల మీద పుండ్లు నయం కావు
  • మతిస్థిమితం కోల్పోవడం (అత్యంత తీవ్రమైన కేసుల్లో)

ఇతర వ్యాధుల కారణంగా కూడా ఈ సంకేతాలన్నీ కనిపించవచ్చు. కాబట్టి, మీకు మధుమేహం ఉందా అని తెలుసుకోవడానికి, ఆరోగ్య కార్యకర్తను కలుసుకోండి లేదా 8 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి, అటుపై ఉపవాసం అనంతరం రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయి పరీక్ష చేయించుకోవడానికి ఏదైనా ప్రయోగశాలకు వెళ్లండి. రెండు వేర్వేరు పరీక్షల్లో మీ చక్కెర స్థాయి 125 కంటే ఎక్కువగా ఉంటే, మీకు మధుమేహం ఉందని అర్థం.

Sources
  • Audiopedia ID: tel010420