మహిళల విషయంలో ఆత్మహత్య ప్రధాన సమస్యగా ఉండడానికి కారణమేమిటి
నిజానికి, ఆత్మహత్య మరణాలనేవి మహిళల్లో కంటే పురుషుల్లోనే మూడు రెట్లు ఎక్కువ. అంటే, ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో 3-4 మంది పురుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే, ఆత్మహత్య ప్రయత్నాల సంఖ్య మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటోంది. పురుషులతో పోలిస్తే, మహిళలు మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ గణాంకాలు గణనీయమైన స్థాయిలో భిన్నంగా ఉంటాయి. ఆత్మహత్యలు చేసుకునే మహిళల సంఖ్య నిరంతరం పెరుగుతూ పోతోంది. తద్వారా, ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళలు మరియు పురుషుల మధ్య నిష్పత్తి క్రమంగా తగ్గిపోతోంది. ఈ దేశాల్లో యువతులు, వివాహిత మహిళలు ఆత్మహత్యకు పాల్పడడం ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు, దక్షిణ భారతదేశంలో యువతుల ఆత్మహత్యల రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటోంది. 2015 నాటికి, ఆత్మహత్య అనేది ప్రపంచవ్యాప్త టీనేజీ అమ్మాయిల పాలిట ప్రధాన హంతకిగా మారింది. 15 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికల మరణాల విషయానికి వస్తే, రోడ్డు ప్రమాదాలు, వ్యాధులు (హెచ్ఐవి/ఎయిడ్స్ లేదా ఫ్లూ వంటివి) లేదా గర్భం కారణంగా సమస్యల కంటే, వాళ్లు ఎక్కువగా ఆత్మహత్యలకే బలవుతున్నారని గుర్తించారు.