మాదకద్రవ్యాలు మరియు మద్యాన్ని వ్యక్తులు దుర్వినియోగం చేయడానికి కారణమేమిటి
చాలామంది వ్యక్తులు వారి జీవితంలోని సమస్యల నుండి తప్పించుకోవడానికి మాదకద్రవ్యాలు మరియు మద్యాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. అన్నిరకాల వ్యక్తులూ ఈవిధంగానే చేసినప్పటికీ, మద్యం లేదా మాదకద్రవ్యాలు దుర్వినియోగం చేసే తల్లిదండ్రులు పిల్లలు కూడా వారి సమస్యల నుండి తప్పించుకోవడానికి అదేవిధమైన దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, మాదకద్రవ్యాలు లేదా మద్యం దుర్వినియోగం అనే 'బలహీనత' తల్లిదండ్రుల నుండి పిల్లలకూ అలవాటు కావచ్చు. సమస్యల నుండి తప్పించుకోవడానికి తమ తల్లితండ్రులు మద్యం లేదా మాదకద్రవ్యాలు ఉపయోగించడం చూసే పిల్లలు కూడా అదే ప్రవర్తన నేర్చుకుంటారు.
తమ జీవితంలోని దుర్భర పరిస్థితులు మార్చడం తమ వల్ల కాదనే నిరాశలో ఉండే వ్యక్తుల్లోనూ మద్యం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. సొంత ఇంటికి దూరమైన వాళ్లు లేదా ఉద్యోగాలు లేదా జీవనోపాధి కోల్పోయినవాళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోవడం లేదా భాగస్వామి దూరం కావడం లాంటి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా మాదకద్రవ్యాలు మరియు మద్యం దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మహిళలు తరచుగా మాదకద్రవ్యాలు లేదా మద్యం దుర్వినియోగం ప్రారంభిస్తుంటారు. ఎందుకంటే, తమ జీవితం మీద తమకు ఎలాంటి నియంత్రణ లేదా అధికారం ఉందని వాళ్లు భావించరు. భాగస్వామి మీద లేదా ఇంట్లోని పురుష కుటుంబ సభ్యుల మీద తాము ఆధారపడినట్లు లేదా వారి దయ మీద బ్రతుకుతున్నట్లు వాళ్లు భావిస్తుంటారు. ఏదైనా సమాజంలో మహిళలకు తక్కువ హోదా ఉంటే, అలాంటి మహిళలు తమను తాము గౌరవించుకోవడం కష్టం కావచ్చు. అయితే, దురదృష్టవశాత్తూ, మాదకద్రవ్యాలు మరియు మద్యం కారణంగా వాళ్ల పరిస్థితి మరింత దిగజారుతుంది మరియు తాము తమ జీవితాలను ఏమాత్రం మెరుగుపరుచుకోలేమని వాళ్లు భావిస్తారు. దాంతో, తమ పరిస్థితులు మెరుగుపరుచుకునే మార్గాలు అన్వేషించడానికి బదులుగా మాదకద్రవ్యాలు లేదా మద్యం దుర్వినియోగం చేయడం ద్వారా, తమ సమయం, డబ్బు మరియు ఆరోగ్యం నాశనం చేసుకుంటూ, ఆ పేరుతో తమ సమస్యలు తప్పించుకోవడానికి మరియు మరచిపోవడానికి ప్రయత్నిస్తారు.
మాదకద్రవ్యాలు లేదా మద్యాన్ని ఒక వ్యక్తి దుర్వినియోగం చేసినప్పుడు, అ వ్యక్తి మనస్సు మరియు శరీరం రెండూ ఆ మాదకద్రవ్యాన్ని మితిమీరి కోరుకోవడం ప్రారంభించవచ్చు. మనస్సుకి ఈ పరిస్థితి ఎదురైనప్పుప్పుడు, దానినే ఆ మాదకద్రవ్యం మీద ఆధారపడటం అంటారు. ఆ మాదకద్రవ్యం కావాల్సిందే అనే బలమైన కోరిక ఒక వ్యక్తి శరీరం అనుభవించినప్పుడు, అది లేకపోతే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. దీనిని శారీరక వ్యసనం అంటారు. మద్యం మరియు కొన్ని మాదకద్రవ్యాలు ఇలాంటి వ్యసనానికి కారణం కావచ్చు. ఒక వ్యక్తి బానిసగా మారినప్పుడు, ఆ మాదకద్రవ్యం ప్రభావం అతను అనుభూతి చెందాలంటే, ఆ వ్యక్తి శరీరానికి ఆ మద్యం లేదా మాదకద్రవ్యాలు మరింత ఎక్కువ మొత్తంలో అవసరమవుతాయి.