మానసిక గాయం అంటే ఏమిటి మరియు అది నా మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది
ఒక మహిళకు లేదా ఆమెకు సన్నిహితమైన వారికి ఏదైనా భయంకర సంఘటన జరిగినప్పుడు, ఆమెకు మానసికంగా గాయమవుతుంది. ఇంట్లో హింస, అత్యాచారం, యుద్ధం, హింస మరియు ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఈ తరహా గాయాలకు సర్వసాధారణ ఉదాహరణలు.
మానసిక గాయం అనేది ఒక వ్యక్తి శారీరక లేదా మానసిక శ్రేయస్సుకి విఘాతం కలిగిస్తుంది. ఫలితంగా, ఆ వ్యక్తి అసురక్షితంగా, అభద్రతతో, నిస్సహాయంగా మరియు ప్రపంచాన్ని లేదా తన చుట్టూ ఉన్న వ్యక్తులను విశ్వసించలేని విధంగా భావిస్తాడు. ప్రత్యేకించి, అది ప్రకృతి వల్ల కాకుండా, వేరొక వ్యక్తి వల్ల సంభవిస్తే, ఒక మహిళ మానసిక గాయం నుండి కోలుకోవడానికి సాధారణంగా చాలా సమయం పడుతుంది. చిన్నతనంలో మానసిక గాయం తగిలితే, ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి లేదా దాని గురించి మాట్లాడటానికి ముందే, ఒక మహిళ మీద ఆమెకి తెలియకుండానే అది చాలా సంవత్సరాలు ప్రభావం చూపిస్తుంది.