మూత్రాశయం మరియు మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్లు నిరోధించడానికి నేనేం చేయవచ్చు
లైంగిక చర్య తర్వాత మూత్ర విసర్జన చేయండి: లైంగిక చర్య సమయంలో, యోని మరియు పాయువు నుండి నుండి సూక్ష్మక్రిములు మూత్రాశయ ద్వారం ద్వారా క్రింది మూత్ర నాళంలోకి ప్రవేశించగలవు. మహిళల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్‌కి అత్యంత సాధారణ కారణాల్లో ఇది ఒకటి. ఈ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి, సెక్స్ పూర్తికాగానే మూత్ర విసర్జన చేయండి. దీనివల్ల మూత్రనాళం శుభ్రమవుతుంది (అయితే, ఈ ప్రక్రియ గర్భధారణను నిరోధించదు).
ఎక్కువ మొత్తంలో ద్రవాలు త్రాగండి: సూక్ష్మక్రిములు స్త్రీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆమె తగినన్ని ద్రవాలు తీసుకోకపోతే, వాటి సంఖ్య పెరుగుతుంది. ప్రత్యేకించి, ఆమె బయటి వేడి వాతావరణంలో పనిచేస్తూ, ఎక్కువ చెమట పడితే, ఈ పరిస్థితి తీవ్రమవుతుంది. మూత్రాశయం ఖాళీగా ఉన్నప్పుడు సూక్ష్మక్రిముల సంఖ్య వేగంగా పెరుగుతుంది. కాబట్టి, ప్రతిరోజూ కనీసం 8 గ్లాసులు లేదా కప్పులు (2 లీటర్లు) ద్రవం త్రాగడానికి ప్రయత్నించండి. వేడి ఎండలో లేదా వేడి గదిలో పని చేసేటప్పుడు మరిన్ని ద్రవాలు త్రాగండి.
ప్రతి 3 నుండి 4 గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నించండి: మూత్రవిసర్జన చేయకపోవడం వల్ల మూత్ర వ్యవస్థలోని సూక్ష్మక్రిముల సంఖ్య పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి, ఎక్కువసేపు మూత్రవిసర్జన చేయకుండా ఉండకండి (ఉదాహరణకు, ప్రయాణంలో లేదా పనిలో ఉన్నప్పుడు).
మీ జననేంద్రియాలు శుభ్రంగా ఉంచుకోండి: జననేంద్రియాల నుండి-ప్రత్యేకించి పాయువు నుండి-వచ్చే సూక్ష్మక్రిములు మూత్ర నాళంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ప్రతిరోజూ జననేంద్రియాలు శుభ్రం చేసుకునేందుకు ప్రయత్నించండి మరియు మల విసర్జన తర్వాత ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు తుడుచుకోండి. ముందుకు తుడుచుకోవడం వల్ల సూక్ష్మక్రిములు పాయువు నుండి మూత్రనాళంలోకి ప్రవేశిస్తాయి. మల విసర్జన తర్వాత, ఏవిధంగా శుభ్రం చేసుకోవాలో చిన్నవయసు అమ్మాయిలకు నేర్పించండి. అలాగే, లైంగిక చర్యకు ముందు మీ జననేంద్రియాలు శుభ్రం చేసుకోండి. నెలసరి కోసం ఉపయోగించే వస్త్రం లేదా ప్యాడ్లను ప్రతి వినియోగానికి ముందు పూర్తిస్థాయిలో శుభ్రం చేయండి.