హానికరమైన రసాయనాలతో పనిచేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు తగ్గించడానికి, వీటిని ప్రయత్నించండిః
మీ చర్మం మీద రసాయనాలు పడకుండా నివారించండి. ఇంట్లో రసాయనాలు ఉపయోగిస్తున్నప్పుడు, రబ్బరుతో చేసిన కిచెన్ గ్లౌజులు (లేదా ప్లాస్టిక్ సంచులు) ఉపయోగించండి. వ్యవసాయం మరియు ఇతర పనుల్లో రసాయనాలు ఉపయోగించేటప్పుడు మందమైన చేతి గ్లౌజులు మరియు బూట్లు ధరించండి. లేకపోతే, రసాయనాలు మీ శరీరంలోకి ప్రవేశించవచ్చు.
రసాయనాలు తాకిన తర్వాత మీ చేతులు కడుక్కోండి. పురుగుమందులు లాంటి గాఢమైన రసాయనాలను మీరు ఉపయోగిస్తుంటే, మీ దుస్తులు మార్చుకోండి మరియు తినడానికి లేదా ఇంటికి వచ్చే ముందు మీ శరీర భాగాలు కడుక్కోండి. మీరు మీ దుస్తులు శుభ్రం చేసుకునే సమయంలో రబ్బరు గ్లౌజులు ఉపయోగించండి.
రసాయనాల నుండి వచ్చే పొగ (ఆవిరి)ని పీల్చకండి. స్వచ్ఛమైన గాలి స్వేచ్ఛగా ప్రవహించే చోట పని చేయండి. వస్త్రం లేదా కాగితపు ముసుగు ధరించినప్పటికీ, రసాయన పొగలు పీల్చకుండా అవి మిమ్మల్ని రక్షించవు.
రసాయనాలను ఆహారం నుండి దూరంగా ఉంచండి. రసాయన నిల్వ కంటైనర్లను శుభ్రంగా కడిగినప్పటికీ, వాటిని ఆహారం లేదా నీటి నిల్వ కోసం ఎప్పుడూ ఉపయోగించవద్దు. కంటైనర్ చాలా శుభ్రంగా కనిపించినప్పటికీ, అందులో నిల్వ చేసే ఆహారం లేదా నీళ్లను విషపూరితం చేయగల రసాయనం అందులో మిగిలే ఉండవచ్చు. ఆహారానికి సమీయంలో లేదా గాలులు బలంగా వీచే సమయంలో పిచికారీలు ఉపయోగించవద్దు.
ఏదైనా రసాయనం మీ కంట్లో పడితే, వెంటనే నీళ్లతో కడగండి. 15 నిమిషాల పాటు కళ్లను నీళ్లతో కడుగుతూనే ఉండండి. ఆ నీళ్లు మరో కంటిలోకి వెళ్లనివ్వకండి. మీ కన్ను మంట పెడుతుంటే, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి.
రసాయనాలను పిల్లలకు దూరంగా ఉంచండి. లేబుల్ మీద సూచించిన విషం సంబంధిత హెచ్చరికల కోసం తనిఖీ చేయండి.