రుతువిరతి సమయంలోనూ నా అనుభూతి మెరుగ్గా ఉండడం కోసం నేనేం చేయగలను
రుతువిరతి అనేది జీవితంలో ఒక సాధారణ భాగం. రుతువిరతి సమయంలో మహిళలకు కొన్నిసార్లు అసౌకర్యంగా ఉన్నప్పటికీ, వారి రోజువారీ అలవాట్లు మరియు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా, చాలా మంది మంచి అనుభూతి కొనసాగించగలరు.
గతంలో, రుతువిరతి సంబంధిత అత్యంత తీవ్ర లక్షణాల నుండి ఉపశమనం కోసం ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ కలిగిన మందులు తీసుకోవాల్సిందిగా మహిళలకు వైద్యులు సిఫార్సు చేసేవారు. దీనినే \"హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ\" (HRT) అని పిలుస్తారు. దురదృష్టవశాత్తూ, HRT కారణంగా, మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టడం మరియు స్ట్రోక్ ప్రమాదం పెరుగుతున్నట్టు గుర్తించారు. కాబట్టి, మహిళలు ఈ మందులు ఉపయోగించకపోవడమే మంచిది.
మీకు అసౌకర్యం కలిగించే లక్షణాలు ఉంటే, క్రింది వాటిని ప్రయత్నించండి: మీకు చెమట పడుతుంటే, సులభంగా తీసేయగల దుస్తులు ధరించండి. వేడి లేదా ఘాటుగా ఉండే ఆహారాలు లేదా పానీయాలకు దూరంగా ఉండండి. అవి వేడి మంటలకు కారణమవుతాయి.
కాఫీ లేదా టీ ఎక్కువగా తాగవద్దు. వాటిలో కెఫిన్ ఉంటుంది. అది మీలో ఆందోళన కలిగిస్తుంది మరియు మీరు నిద్రపోకుండా నిరోధిస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
మీకు మద్యం అలవాటు ఉంటే, తక్కువ మొత్తంలో మాత్రమే త్రాగండి. మద్యం వల్ల రక్తస్రావం మరియు వేడి మంటలు పెరుగుతాయి.
ధూమపానం లేదా పొగాకు నమలడం మానేయండి. ఇది అసాధారణ రక్తస్రావం కలిగించి, ఎముకలు బలహీనమై, పరిస్థితి మరింత దిగజార్చవచ్చు.
మీ మనఃస్థితి సులభంగా మారుతున్న విషయాన్ని మీ కుటుంబానికి వివరించండి. రుతువిరతి ఎదుర్కొంటున్న ఇతర మహిళలతో మీ భావాల గురించి చర్చించడానికి కూడా ఇది సహాయపడగలదు.
మీ సమాజంలో ఉపయోగించే సంప్రదాయ నివారణలు గురించి అడగండి. ఇప్పటికే రుతువిరతికి చేరిన మహిళలు ఈ విషయంలో మీకు సహాయపడగల మార్గాల గురించి చెప్పగలరు.