రోగనిరోధకత ఎందుకు అత్యంత ముఖ్యమైనది
అందుబాటులో ఉన్న టీకాలతో నివారించగల వ్యాధులతోనే ప్రతి సంవత్సరం 14 లక్షల మందికి పైగా పిల్లలు మరణిస్తున్నారు.
రోగనిరోధకత అనేది బాల్యంలో ఎదురయ్యే అత్యంత ప్రమాదకర వ్యాధుల నుండి పిల్లలను రక్షిస్తుంది. వికలాంగులతో సహా, పిల్లలందరికీ తప్పక టీకాలు వేయించాలి. పిల్లలకు టీకాలు ద్వారా రోగనిరోధక శక్తి అందిస్తారు. వీటిని ఇంజెక్ట్ చేస్తారు లేదా నోటి ద్వారా ఇస్తారు. వ్యాధుల నుండి పిల్లలకు రక్షణ పెంపొందించడం ద్వారా టీకాలు పనిచేస్తాయి. వ్యాధి రావడానికి ముందే టీకా ఇచ్చినప్పుడే రోగనిరోధకత పనిచేస్తుంది.
రోగనిరోధకత లేని చిన్నారికి తట్టు, కోరింత దగ్గు మరియు మరణానికి దారితీయగల అనేక ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధుల నుండి బయటపడినప్పటికీ, ఆ పిల్లలు బలహీనంగా ఉంటారు మరియు సరైన ఎదుగుదల ఉండకపోవచ్చు. వారు శాశ్వతంగా వికలాంగులు కావచ్చు. పోషకాహార లోపం మరియు ఇతర అనారోగ్యాల కారణంగా, ఆ తర్వాత వాళ్లు మరణించవచ్చు. రోగనిరోధక శక్తి కలిగిన పిల్లలకు ఇలాంటి ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణ ఉంటుంది. ఈ వ్యాధులనేవి తరచుగా వైకల్యం లేదా మరణానికి దారితీస్తాయి కాబట్టి, వాటి నుండి రక్షణ పొందే హక్కు ప్రతి చిన్నారికి ఉంది.
ప్రతి అమ్మాయి మరియు అబ్బాయికి పూర్తి స్థాయిలో రోగనిరోధక శక్తి అందించాలి. పిల్లలకి ముందస్తు రక్షణ చాలా ముఖ్యం. పిల్లల మొదటి సంవత్సరంలో మరియు రెండవ సంవత్సరంలో రోగనిరోధకత టీకాలు చాలా కీలకం. గర్భిణీ స్త్రీలు తమను మరియు వారి నవజాత శిశువును రక్షించుకోవడం కోసం ధనుర్వాతానికి రోగనిరోధక శక్తి పొందడం కూడా చాలా అవసరం.