రోజులు లెక్కింపు పద్ధతి ఎలా పనిచేస్తుంది
రోజులు లెక్కింపు పద్ధతిలో, మీరు ఫలవంతంగా ఉండగల ఏ రోజుల్లోనూ మీరు లైంగిక చర్యలో పాల్గొనకూడదు. అయితే, మీ నెలసరి చక్రం 26 నుండి 32 రోజుల మధ్య క్రమబద్ధంగా ఉన్నప్పుడే ఈ పద్ధతి ఉపయోగించవచ్చు. అంటే, మీ నెలసరి రక్తస్రావం మొదటి రోజు నుండి లెక్కించినప్పుడు మీ తదుపరి నెలసరి రక్తస్రావం మొదటి రోజు మధ్య కనీసం 26 రోజులు ఉండాలి మరియు ఈ వ్యవధి 32 రోజులకు మించకూడదు.
మీకు ఒక నెలసరి రక్తస్రావం నుండి తదుపరి రక్తస్రావం వరకు మధ్య రోజుల సంఖ్య దాదాపుగా ఒకే విధంగా ఉంటే (సాధారణ రుతుచక్రాలు), ఈ పద్ధతి సాధారణంగా పనిచేస్తుంది. అయితే, మీరు రుతుచక్రాల కాల వ్యవధి అప్పుడప్పుడూ దీనికి భిన్నంగా ఉంటే, ఈ పద్ధతి పాటించినప్పటికీ మీరు సులభంగా గర్భవతి కాగలరు. ఒక మహిళ అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా అత్యంత ఒత్తిడిలో ఉన్నప్పుడు రుతుచక్రం పొడవులో మార్పు రావడం సాధారణమే. కాబట్టి, మీరు అనారోగ్యానికి లేదా ఒత్తిడికి గురైనప్పుడు, మీ రుతుచక్రం మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మీరు వేరొక కుటుంబ నియంత్రణ పద్ధతి ఉపయోగించడం మంచిది.