వంట చేసే మంటలు మరియు పొగ నా ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి
చాలామంది మహిళలు ఆహారం సిద్ధం చేయడంలోనే రోజులో చాలా గంటలు గడుపుతారు. తద్వారా, పొయ్యి మంటలు మరియు పొగ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వారిని ప్రమాదంలో పడేస్తుంటాయి. కిరోసిన్ మరియు ఇతర ద్రవ మరియు వాయు ఇంధనాలు పేలినప్పుడు వారు కాలిపోవడం మరియు గాయాలు కావడం జరుగుతుంది.
కలప, బొగ్గు, జంతువుల పేడ లేదా పంట అవశేషాలు లాంటి బాగా పొగ వచ్చే ఇంధనాలతో వంట చేసే మహిళలకు తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. పొగ త్వరగా బయటకు రాని విధంగా, ఇంటి లోపల ఈ ఇంధనాలు మండించినప్పుడు మరిన్ని సమస్యలు కలిగిస్తాయి. ఆ ఇంధనాల్లో రసాయనాలు ఉంటే, పంట అవశేషాల్లో పురుగుమందులు లేదా ఎరువులు ఉంటే, వాటి నుండి వచ్చే పొగ మరింత హానికరం కాగలదు.
వంట చేసే మంటలు నుండి వచ్చే పొగ దీర్ఘకాలిక దగ్గు, జలుబు, న్యుమోనియా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు మరియు ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతుంది. బొగ్గు పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, నోరు మరియు గొంతులో క్యాన్సర్ కూడా రావచ్చు.
వంట గది పొగ పీల్చే గర్భిణీ స్త్రీలు మైకము, బలహీనత, వికారం మరియు తలనొప్పితో బాధపడవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మహిళ శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి, ఆమెకి పైన పేర్కొన్న ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగ కారణంగా, ఆమెలో బిడ్డ మరింత నెమ్మదిగా పెరగడానికి, పుట్టినప్పుడు తక్కువ బరువుతో ఉండడానికి, నెలలు నిండకుండానే పుట్టడానికి కూడా కారణమవుతుంది.
ఈ ఆరోగ్య సమస్యల విషయంలో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే, మహిళలు ఎక్కువ గంటలు పొగ గాలి పీలుస్తుంటారు. రోజులో ఎక్కువ భాగం పొగ వచ్చే వంట పొయ్యి దగ్గర ఆడుకునే చిన్న పిల్లలకు జలుబు, దగ్గు, న్యుమోనియా మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.