అనేక దేశాల్లో వృద్ధుల్లో (65 ఏళ్లు దాటిన వాళ్లలో) ఆత్మహత్యల రేటు బాగా పెరిగింది.
దీనికి కారణం కాగల అంశాలు:
అనేక దేశాల్లో (ఆధునీకరణ కారణంగా) సాంప్రదాయ విలువలు మరియు నిబంధనలు త్వరగా దెబ్బతింటున్నాయి. వృద్ధులను గౌరవించి, అభినందించడానికి బదులుగా, కొన్ని సమాజాల్లో వారిని అనవసర భారంగా చూస్తుంటారు. వాళ్ల సంరక్షణను ఒక అసౌకర్యంగా భావిస్తుంటారు. ఈ అగౌరవం తట్టుకోలేని పరిస్థితుల్లో, చాలా మంది వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తాము ఇకపై తమ కుటుంబానికి, సమాజానికి భారం కాకూడదని వాళ్లు భావించడమే అందుకు కారణం.
వాళ్లకి ఇష్టమైన వారు తప్పనిసరిగా దూర ప్రాంతాలకు వలస వెళ్ళడం. చాలా దేశాల్లో, నేటి కాలంలో సొంత ఊళ్లలో ఆహారం మరియు పని దొరికే పరిస్థితి లేకపోవడం లేదంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నగరాల్లో మాత్రమే ఉండడం వల్ల పిల్లలు మరియు మనవళ్లు మనవరాళ్లు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నారు. పని ప్రదేశానికి దగ్గరగా ఉండడం కోసం, చాలా మైళ్ల దూరం వలస వెళ్లిపోతున్నారు. ఈ రకమైన వలస కారణంగా, వాళ్ల తల్లితండ్రులు లేదా తాతయ్య బామ్మ లాంటివాళ్లు తమ వాళ్లకి దూరంగా సొంత ఊళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. వాళ్ల గురించి పట్టించుకునేవాళ్లు లేక వాళ్ల ఒంటరితనంతో ఉంటారు. ఆ నిరాశలో బలవన్మరణానికి పాల్పడేందుకు సిద్ధమవుతుంటారు.
మహిళలు తరచుగా వృద్ధాప్యాన్ని \"నష్టాల కాలం\"గా భావిస్తారు. స్నేహితులు మరియు ప్రియమైన వాళ్లు కళ్లముందే మరణించడం వాళ్లని బాధపెడుతుంది. భర్తను కోల్పోయి ఇటీవల వితంతువైన మహిళలు తీవ్ర దుఃఖానికి గురవుతుంటారు. అదే సమయంలో, తరచుగా వారి ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారుతుంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి తగినంత సహాయం మరియు మద్దతు లభించని వాళ్లు తరచుగా ఈ సమస్యలు ఎదుర్కోలేకపోతుంటారు.
మహిళలు వారి పదవీ విరమణతో ఆత్మగౌరవం కోల్పోతారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి ప్రబలంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలామంది మహిళలు ఉద్యోగంతో తమను తాము పోషించుకుంటారు. పదవీవిరమమణ తర్వాత, కాలక్రమేణా, వృద్ధ మహిళలు నిరాశలో కూరుకుపోతారు. పదవీ విరమణ వారిలో ఆత్మగౌరవం మరియు స్వాతంత్ర్యం కోల్పోయేలా ప్రేరేపిస్తుంది. తమను తాము నిరుపయోగంగా మరియు అనవసరంగా భావిస్తారు. పని వాతావరణంలోని సామాజిక పరిచయాలు కోల్పోవడం వల్ల వారు ఒంటరిగా మరియు వదలివేయబడినట్టుగా భావిస్తారు.
ఆరోగ్య సమస్యలు. దీర్ఘకాలిక అనారోగ్యం మరియు/లేదా నొప్పితో ఆరోగ్యం గతి తప్పడం, తరచుగా శారీరక ఇబ్బందులు లాంటివి వ్యక్తిగత స్వయంప్రతిపత్తి మరియు వ్యక్తిగత గౌరవం కోల్పోవడానికి దారితీస్తుంది. కొందరు వృద్ధ మహిళలు తాము ఇక జీవించకూడదని భావించడానికి ఇవన్నీ కారణాలుగా ఉంటాయి.