విష ప్రభావిత గాయాల నుండి నేను నా చిన్నారిని ఎలా నిరోధించగలను
హానికర పదార్థాలను పిల్లల చేతికి చిక్కకుండా చూడడమే వారు విష ప్రభావానికి గురికాకుండా కాపాడడంలో కీలకమైన అంశం.
విషపూరిత ద్రవాలను ఎట్టిపరిస్థితుల్లోనూ శీతల పానీయాల సీసాలు లేదా బీరు సీసాలు, జాడీలు లేదా కప్పుల్లో ఉంచకూడదు. ఎందుకంటే, పిల్లలు పొరపాటున వాటిని తాగేసే ప్రమాదం ఉంది. అన్ని ఔషధాలు, రసాయనాలు మరియు విష పదార్థాలను వాటి అసలైన కంటైనర్లలోనే భద్రపరచాలి. వాటికి గట్టిగా మూతలు బిగించాలి మరియు పిల్లలకు అందుబాటులో ఉండకూడదు.
డిటర్జెంట్లు, బ్లీచ్‌లు, రసాయనాలు మరియు ఔషధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. వాటికి గట్టిగా మూతలు పెట్టి, లేబుల్ అతికించాలి. వాటిని అల్మారాలో లేదా ట్రంక్‌లో పెట్టి తాళం వేయాలి లేదా పిల్లలు చేరుకోలేని ఎత్తైన షెల్ఫ్‌లలో ఉంచాలి.
పెద్దల కోసం ఉద్దేశించిన ఔషధాలు చిన్న పిల్లలకి మరణ ప్రమాదం కలిగించవచ్చు లేదా గాయపరచవచ్చు. ఆ బిడ్డకు సూచించిన ఔషధాలు మాత్రమే ఆ బిడ్డకు ఇవ్వాలి. పెద్దవారి కోసం లేదా ఇతర పిల్లల కోసం సూచించిన వాటిని ఆ బిడ్డకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఒక చిన్నారి తనకు తానుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఔషధాలు తీసుకోకూడదు. అవసరమైనప్పుడు తల్లిదండ్రులు లేదా ఇతర సంరక్షకులు మాత్రమే చిన్నపిల్లలకు ఔషధాలు ఇవ్వాలి. ఔషధాలను పిల్లలకు అందుబాటులో లేని విధంగా నిల్వ చేయాలి.
అందుబాటులో ఉన్న పక్షంలో, విషపూరిత పదార్థాలు నిల్వ చేసే కంటైనర్లకు పిల్లలు-తీయలేని విధంగా ఉండే మూతలు బిగించాలి.