HIV అంటే ఏమిటి
HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) అనేది మీ కంటికి కనిపించని అతిచిన్న సూక్ష్మజీవి. దీనిని వైరస్ అని పిలుస్తారు. ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్) అనేది ఒక వ్యక్తి HIV అనే ఎయిడ్స్ వైరస్ బారిన పడిన తర్వాత తీవ్రమయ్యే వ్యాధినే ఎయిడ్స్‌గా పిలుస్తారు.
ఒక వ్యక్తి HIV బారిన పడినప్పుడు, ఆ వైరస్ ఆ వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడడం కోసం మీ శరీరంలోని ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఉపయోగపడుతుంది. HIV వైరస్ అనేది ఈ వ్యవస్థ మీద దాడి చేసి, ఇతర ఇన్ఫెక్షన్లతో అది పోరాడే పరిస్థితి పూర్తిగా తగ్గిపోయే వరకు దానిలో కణాలను మెల్లగా చంపేస్తుంది. HIV సోకిన చాలా మంది 5 నుండి 10 సంవత్సరాల వరకు HIV సంబంధిత అనారోగ్యానికి గురికారు. కానీ, చివరకు వారిలోని రోగనిరోధక వ్యవస్థ సాధారణ ఇన్ఫెక్షన్లతో సైతం పోరాడలేని పరిస్థితి వస్తుంది. HIV వల్ల ఒకరిలో అనారోగ్యం కనిపించడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి, HIV ఉన్న చాలామంది తాము ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తారు మరియు వాళ్లకి అది వచ్చినట్టు కూడా తెలియదు.
గుర్తుంచుకోండి: మీరు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, మీరు ఆవిధంగా అనుభూతి చెందుతున్నప్పటికీ, మీకు ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుండి మీ ద్వారా HIV ఇతరులకు వ్యాపించగలదు. ఒక వ్యక్తిని చూసి, అతనికి లేదా ఆమెకి HIV ఉందో లేదో మీరు చెప్పలేరు. మీకు వ్యాధి సోకిందో లేదో తెలుసుకోవాలంటే, HIV పరీక్ష చేయించుకోవడం ఒక్కటే ఏకైక మార్గం.