HIV వ్యాప్తి నిరోధం కోసం ఉపకరణాలను నేనెలా క్రిమిసంహారకం చేయాలి
మీ ఉపకరణాలు ఉపయోగించిన వెంటనే క్రింద పేర్కొన్న 1 మరియు 2 దశలు చేయాలి. వాటిపై రక్తం మరియు శ్లేష్మం ఎండిపోకుండా చూడండి. ఉపకరణాలను మీరు మళ్లీ ఉపయోగించే ముందు 3వ దశను సరిగ్గా చేయాలి. మీరు మీ ఉపకరణాలు నిల్వ చేయాలనుకున్నప్పుడు అన్ని దశలు కలిసి చేయవచ్చు. తద్వారా, అవి క్రిమిసంహారకం చేయబడతాయి.
1. నానబెట్టండి: మీ ఉపకరణాలన్నీ 10 నిమిషాలు నానబెట్టండి. వీలైతే, 0.5 శాతం గాఢత కలిగిన బ్లీచ్ (క్లోరిన్) ద్రావణం ఉపయోగించండి. ముందుగా మీ ఉపకరణాలను బ్లీచ్ ద్రావణంలో నానబెట్టడం వల్ల వాటిని శుభ్రం చేసేటప్పుడు సంక్రమణ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీ వద్ద బ్లీచ్ లేకపోతే, మీ ఉపకరణాలను నీటిలో నానబెట్టండి.
2. కడగండి: ప్రతి ఒక్క ఉపకరణం పూర్తి శుభ్రంగా కనిపించే వరకు సబ్బు నీళ్లు మరియు బ్రష్‌తో వాటిని బాగా రుద్దండి మరియు వాటిని శుభ్రమైన నీటితో కడగండి. పదునైన అంచులు లేదా మొనల వల్ల మీ చర్మం కోసుకోకుండా జాగ్రత్త వహించండి. వీలైతే, మందమైన చేతి తొడుగులు లేదా మీ వద్ద ఉన్న ఏవైనా చేతి తొడుగులు ఉపయోగించండి.
3. క్రిమిసంహారకం చేయండి: 20 నిమిషాల పాటు (బియ్యం ఉడికించడానికి పట్టే సమయం వరకు) ఉపకరణాలను ఆవిరిలో పెట్టండి లేదా ఉడకబెట్టండి.
ఆవిరి పెట్టడం మరియు మరిగించడం రెండింటి కోసం, నీళ్లు పూర్తిగా మరిగిన తర్వాత నుండి 20 నిమిషాలు వేచి ఉండండి. ఈ సమయంలో, అందులోకి కొత్తగా ఏ ఉపకరణం వేయకండి.